PM Modi: ప్రధాని మోడీకి మరోసారి లెటర్ రాస్తా..

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి లెటర్ రాయాలని నిర్ణయించుకున్నారు. కరోనా టీకాలు వేసే విషయంలో వయసు 45 ఏళ్లు పైబడ్డవారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు. ఈ మేరకు ఇవాళ మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ మీటింగులో తీర్మానించారు. ఈ సమావేశంలో ఎక్కువగా కొవిడ్-19 కంట్రోల్ చర్యలు, వ్యాక్సినేషన్, ఆక్సీజన్ నిల్వలు-రవాణా, బెడ్ల కొరత తదితర అంశాల గురించే చర్చించారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రాణవాయువును తెప్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకి వెల్లడించారు.

అన్ని బస్సులు బంద్..

రేపు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి లోకల్ ఆర్టీసీ బస్సులను, అంతర్రాష్ట్ర సర్వీసులను నిలిపేయనున్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాలేజీలను ఉదయం పదకొండున్నర వరకే అనుమతిస్తారు. షాపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచుతారు. ఇక ఆ తర్వాత రోడ్ల మీద జనసంచారం లేకుండా చూడాలని, ఈ మేరకు పోలీసులు, అధికార యంత్రాంగం కోఆర్డినేషన్ తో పనిచేయాలని, కర్ఫ్యూని పక్కాగా అమలుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రుల నుంచి అభిప్రాయాలను స్వీకరించి ఆమోద ముద్ర వేశారు.

అదనంగా 50 వేల బెడ్లు?..

ప్రభుత్వాసుపత్రుల్లో సరిపోను సంఖ్యలో పడకలు లేకపోవటం వల్ల చాలా మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అదనంగా 50 వేల బెడ్లను అందుబాటులోకి తేవాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆక్సీజన్ నిల్వలు ఉన్నా దాన్ని రవాణా చేసేందుకు ట్రక్కులు లేకపోవటంతో విదేశాల నుంచి కొనుగోలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 45 ఏళ్ల లోపు, 18 ఏళ్లు పైన వయసున్నవారికి ఉచితంగా టీకా వేయించాలని ఏపీ గవర్నమెంట్ గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో దీనికి కావాల్సిన నిధుల పైన ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో చర్చించారంట. పర్యాటక శాఖకు సంబంధించిన పలు అంశాలు సైతం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

 

 

Advertisement