ప్లేట్ అన్నం ధ‌ర అక్ష‌రాలా.. రూ. 7500.. ఎక్క‌డో తెలుసా?

పొట్ట‌నిండ‌డానికి నాలుగు మెతుకులు అయిన చాలని కొంద‌రు చెబుతుంటారు. అన్నీ ఉన్న‌ప్పుడు అన్నం విలువ ఎవ‌రికి తెలియ‌దు. అది దొర‌క‌న‌ప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘ‌న్స్‌కి అన్నం విలువ ఏంటో చాలా తెలిసొచ్చింది. తాలిబ‌న్స్ ఎప్పుడైతే ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని ప్ర‌వేశించారో అప్ప‌టి నుండి వారికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. తాలిబ‌న్స్ చెర నుండి త‌ప్పించుకుపోయేందుకు అప్ఘనిస్తాన్ వాసులంతా కాబుల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు.

ఏదో విమానం ప‌ట్టుకొని ఎక్క‌డికో పోయి ప్రాణాలు ద‌క్కించుకోవాల‌ని ఆఫ్ఘ‌న్ వాసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. వారిని తాలిబన్స్ అడ్డుకోవ‌డ‌మే కాకుండా దాడులు చేస్తున్నారు. రోజురోజుకు అక్క‌డ ఆకృత్యాలు బాగా పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అయితే దీనిని ప్ర‌పంచం అంతా మౌనంగా గ‌మ‌నించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

బ‌య‌ట దేశాల‌కు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు భారీగా త‌ర‌లి వ‌స్తుండ‌డంతో అక్క‌డ‌ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తాగునీటి కోసం ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆహరం అందక కొందరు నీరసంతో సొమ్మసిల్లిపోతున్నారు. ఎయిర్ పోర్టు బయట తాగునీటిని ఆహారాన్ని అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. నీళ్ల బాటిల్ 40 డాలర్లు(సుమారు రూ. 3వేలు) ఒక ప్లేట్ రైస్ 100 డాలర్లు (రూ.7500)కు విక్రయిస్తున్నారు.

ఆహార ప‌దార్ధాల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్ క‌రెన్సీలో కాకుండా డాలర్లలో విక్రయిస్తుండటంతో అఫ్ఘాన్ వాసులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ బతుకుతున్నారు. ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న ప్రజలకు తాలిబన్లు సాయం చేయకపోగా వారిపై దాడులకు దిగుతున్నారు. తాలిబన్ ప్రతినిధి జబీరుల్లా ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ తాము ఎయిర్ పోర్టునకు వెళ్లే దారులను మూసివేస్తున్నామని ఇకపై అఫ్ఘన్ వాసులు దేశం విడిచి వెళ్లలేరన్నారు.

విదేశీయులు మాత్రమే వారి దేశాల‌కు వెళ్లొచ్చ‌ని, ఆఫ్ఘ‌న్స్‌కి తాలిబన్స్ నుండి ఎలాంటి హానీ ఉండ‌ద‌ని చెప్పుకొచ్చారు. వారు ఇలా చెప్పిన‌ప్ప‌టికీ ఆకృత్యాల‌కు ఏ మాత్రం వెనుకాడ‌డం లేదు.