Lucknow Express : వాటర్ బాటిల్ కి రూ.5 ఎక్కువ తీసుకున్నందుకు రూ.లక్ష ఫైన్
NQ Staff - December 17, 2022 / 05:05 PM IST

Lucknow Express : రైలు ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు హడావిడిగా ఉండి అవసరం కోసం రైల్వే స్టేషన్ లో మంచి నీళ్లు ఇతర తినే పదార్థాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ సమయం లో వ్యాపారస్తులు ఎంత అడిగితే అంత చేతిలో పెట్టి వెళ్లిపోతుంటారు.
అదే అదునుగా వ్యాపారస్తులు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. చండీగఢ్ నుండి షాజహాన్పూర్ కు వెళ్తున్న శివం భట్ అనే వ్యక్తి లక్నో ఎక్స్ప్రెస్ లో ప్రయాణించాడు.
మార్గం మధ్యలో దాహం వేసి ఒక వాటర్ బాటిల్ కొనేందుకు వెళ్లగా పదిహేను రూపాయలు రేటు ఉన్న బాటిల్ ని 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు అంటూ ప్రశ్నించగా అవసరం ఉంటే తీసుకో.. లేదంటే వదిలేయ్ అన్నట్లుగా వాటర్ బాటిళ్లు అమ్మే వ్యక్తి సమాధానం ఇచ్చాడట.
ఆ వ్యవహారం అంతా కూడా అతడు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా రైల్వే అధికారులకు కూడా సమాచారం ఇచ్చాడు. దాంతో వెంటనే స్పందించిన రైల్వే అధికారులు లక్నో ఎక్స్ప్రెస్ లో వాటర్ బాటిల్స్ అమ్మే లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ ని అరెస్టు చేయడంతో పాటు అతడి నుండి ఏకంగా లక్ష రూపాయల జరిమానాన్ని వసూలు చేసినట్లుగా ప్రకటించారు.
ఐదు రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నందుకు లక్ష రూపాయలు జరిమానా కట్టల్సి వచ్చింది. ఇక నుండి అయినా రైల్వే స్టేషన్స్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.