Pawan Kalyan: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఎమ్మెస్సార్ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సంతాపం

Pawan Kalyan: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి, ఆ సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) ఇవాళ మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కనకదుర్గ పార్థివ దేహానికి ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం స్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనకదుర్గ మృతి ప‌ట్ల రాజకీయ, సినీ, పాత్రికేయ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. రాధాకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కనకదుర్గ గారు చనిపోయారని తెలిసి షాక్ కి గురయ్యానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని దేవుణ్ని వేడుకుంటున్నట్లు ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణ రావు (87) ఇకలేరు. కరోనా సోకిన ఆయన్ని ఆదివారం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు చనిపోయారు. కంబైన్డ్ ఏపీ పాలిటిక్స్ లో ఈయన ఎమ్మెస్సార్ గా సుపరిచితులు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే భోళా మనిషి. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆర్టీసీ ఛైర్మన్ గా రెండు సార్లు చేశారు. పీసీసీ చీఫ్ గా, రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 2006లో కేసీఆర్ కి సవాల్ విసిరి కరీంనగర్ బై ఎలక్షన్ కి కారణమయ్యారు. కేసీఆర్ భారీ మెజారిటీతో గెలవటంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ముక్కుసూటిగా..

ఎమ్మెస్సార్ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఎమ్మెస్సార్ ముక్కుసూటి మనిషి అని కేసీఆర్, పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన చనిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెస్సార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement