Pawan Kalyan: శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: రేపు శనివారం మే నెల ఒకటో తారీఖు. మే డే. ప్రపంచ కార్మిక దినోత్సవం. దీన్నే అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం అని కూడా అంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ అధినేత, సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మే డే రేపైతే ఇవాళ శుక్రవారమే ఎందుకు విషెస్ చెప్పారనే డౌటు కొందరికైనా రావొచ్చు. ఎందుకంటే ఈ వార్త రేపు అన్ని పేపర్లలో రావాలి కదా. అందుకే ఒక రోజు ముందుగా ప్రకటన విడుదల చేశారు. అఫ్ కోర్స్ జనసేన పార్టీ ఒక్కటే కాదు. అన్ని రాజకీయ పార్టీలూ ఇలాగే చేస్తాయనుకోండి. అది వేరే విషయం.

ప్రకటనలో ఏం చెప్పారు?..

‘ప్రపంచ పురోగతిలో.. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో.. శ్రమ జీవుల పాత్ర ఎనలేనిది. ఈ డెవలప్మెంటులో శ్రామిక సోదరులు ధారపోసిన స్వేద జలానికి ఎంతని విలువ కట్టగలం?. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి, పోరాడి సాధించిన రోజు మే డే. మా శ్రమను గుర్తించండి అని కష్ట జీవులు పోరాటానికి దిగే పరిస్థితి రాకూడదు. ప్రతిఒక్కరూ శ్రమను గౌరవించాలి. అప్పుడే కార్మికుల కళ్లల్లో నిజమైన ఆనందాన్ని చూస్తాం. కార్మిక లోకానికి నా తరఫున, జనసేన పార్టీ పక్షాన కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

పార్టీ ఆకాంక్ష ఇదే..

పరిశ్రమల్లో, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్నవారి నుంచి అసంఘటిత రంగాల్లో ఉన్నవారి వరకు.. అందరికీ కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలుకావాలన్నదే జనసేన పార్టీ ఆకాంక్ష. కరోనా సెకండ్ వేవ్ కఠినంగా ఉన్న ఈ విపత్కర తరుణంలో కార్మికులకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ కష్ట జీవుల కుటంబాలను తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఆరోగ్యపరంగా వారికి అవసరమైన అన్ని సేవలను సక్రమంగా అందించాలి అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రకటనను పార్టీ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్ చేశారు.

Advertisement