Pawan Kalyan : పొత్తుల‌పై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌లో అర్ధ‌మేమిటి?

Pawan Kalyan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాలు రోజురోజుకి చాలా ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. 2024 ఎల‌క్ష‌న్స్ కోసం ఎవ‌రికి వారు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటుండ‌గా, జ‌న‌సేన-టీడీపీ మ‌ళ్లీ పొత్తు పెట్టుకుంటాయ‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం న‌డుస్తుంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మయానికి ఏయే పార్టీలు పొత్తులు పెట్టుకోనున్నాయ‌న్న దానిపై ఇప్ప‌టి నుంచే చ‌ర్చ మొద‌లైంది.

Pawan Kalyan about Janasena and telugu desam party alliance
Pawan Kalyan about Janasena and telugu desam party alliance

ఇటీవ‌ల కుప్పం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌నసేన‌తో పొత్తుల విష‌య‌మై టీడీపీ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ.. వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదని చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ అంశంపై జ‌న‌సేత అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిసారి స్పందించారు. పొత్తుల‌పై ఒక్కడినే నిర్ణ‌యం తీసుకోన‌ని తేల్చి చెప్పిన జ‌న‌సేనాని అంద‌రితో చ‌ర్చించాకే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు.

కరోనా మూడో వేవ్ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇందులో పాల్గొన్నారు. పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పలు పార్టీలు మనతో పొత్తులు కోరుకున్నప్పటికీ మనం మాత్రం ముందుగా సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిద్దామని పవన్ కళ్యాణ్ పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఈ వ్యవహారంలో అంతా ఒకటే మాట మీద ఉందామన్నారు. ఎవరు ఏం మాట్లాడినా.. మైండ్ గేంలు ఆడినా మనం మాత్రం పావులు కావొద్దని నిర్దేశించారు.

జనసేన పార్టీ అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వచ్చిన గుంపు కాదు. ఒక కట్టుదిట్టమైన ఆలోచనా విధానంతో వ్యక్తిగత అజెండాలు లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా, డబ్బు కోసం కాకుండా కేవలం ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడం ఎంతో కష్టసాధ్యమైన విషయం. అలాంటిది ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నామంటే సామాన్య విషయం కాదు.ఈ ఏడాది లోపే సంపూర్ణంగా 175 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు నిర్మాణం చేసుకుందామని పవన్ పిలుపునిచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.