Palamuru Rangareddy Lift Irrigation : నాడు.. వలపోతలు, వలస బతుకులు..నేడు.. జలసిరులు, పాలమూరు పల్లెల్లో కళకళలు
NQ Staff - September 16, 2023 / 04:44 PM IST

Palamuru Rangareddy Lift Irrigation :
నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో పుట్టిందే తెలంగాణ ఉద్యమం. 60 ఏళ్ల సమైక్య పాలనలో అణచివేతకు, అన్యాయానికి గురైన తెలంగాణను ఆంధ్రా పాలకుల చెర నుంచి విడిపించేందుకు ఆవిర్భవించిందే స్వరాష్ట్ర కాంక్ష. ప్రత్యేక తెలంగాణ సిద్ధించాక ఒక్కో రంగాన్ని అభివ్రుద్ధి చేస్తూ, నీళ్లు నిధులు నియామకాల మాటను నిజం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న తెలంగాణ సర్కార్ తాజాగా పాలమూరు ప్రజల బతుకుల్లో వెలుగులు నింపి జలకళతో కన్నీళ్లను తుడిచింది. రాష్ట్ర ఇంజనీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టం ఆవిష్క్రుతమైంది.
వలస జీవులుగా మారిన పాలమూరు ప్రజల గోస తీరుస్తూ, సాగునీటి కోసం కంటున్న కలలు నిజం చేస్తూ దశాబ్ధాల ఆశని నిజం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
నిజానికి 2015లోనే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో, 35 వేల కోట్ల అంచనా వ్యయంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నాంది పడింది. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంతో ప్రారంభమయ్యాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనుంది.
ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నిండనున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటి ఎత్తిపోతలను ప్రారంభించేందుకు అధికారయంత్రాంగం సన్నాహాలు చేసింది.
తెలంగాణకి రావాల్సిన వాటాలో జరిగిన మోసాల కారణంగా, దక్కాల్సిన నీరు దక్కనందు వల్ల పాలమూరు చాలా నష్టపోయింది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్ కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 61 శాతం. మరోవైపు తుంగభద్ర, ఇంకోవైపు భీమా, దుందుభి నదులు. దాదాపు 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు అనుకూలమైన భూములు. అందుకే హైదరాబాద్ స్టేట్ ఈ ప్రాంతాన్ని పచ్చగా చేసేందుకు 1935 నుంచే అనేక ప్రాజెక్టులను డిజైన్ చేసింది.
నికరంగా 174 టీఎంసీలను ఒడిసిపట్టి, గ్రావిటీతోనే దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రణాళికలను రూపొందించింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలు చేసింది. అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒప్పందాలు కూడా చేసుకుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడుతున్న సమయంలోనే విలీనం పేరిట దారుణమైన వంచనకు గురైంది తెలంగాణ. ఎంత వద్దని వాదించినా, నదీజలాల్లో హక్కు కోల్పోతామని లెక్కలతో సహా నిరూపించినా వినకుండా అప్పటి కాంగ్రెస్ తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది.

Palamuru Rangareddy Lift Irrigation
ఆ విలీనం తెలంగాణకు, ముఖ్యంగా పాలమూరుకు శాపంలా మారింది. అప్పటివరకు కృష్ణాలో కేవలం 8 శాతంగా ఉన్న కర్ణాటక పరివాహక ప్రాంతం హైదరాబాద్ స్టేట్‌లోని అనేక ప్రాంతాలు కలవడంతో ఏకంగా 44 శాతానికి పెరిగింది. తెలంగాణకు ఆ మేరకు పరివాహక ప్రాంతం తగ్గి బచావత్ కేటాయింపుల్లోనూ మొదట అన్యాయానికి గురైంది. మరోవైపు ఉమ్మడి ఏపీలో వివక్షకు గురై ఉన్న పరివాహకం మేరకు కూడా కేటాయింపులు లేక తల్లడిల్లిపోయింది. దాంతో హైదరాబాద్ స్టేట్ ప్రణాళికలన్నీ చరిత్రపుటల్లోకెక్కాయి.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 107, 108 ప్రకారం నదీ జలాల వినియోగం కోసం హైదరాబాద్ స్టేట్ రూపొందించిన ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు జలాలను కేటాయించే అవకాశమున్నా ఏనాడూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. మహబూబ్‌నగర్ దుర్భర పరిస్థితిని చూసి బచావత్ ట్రిబ్యునల్ చలించిపోయి జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు కేటాయించడమేకాదు.. ఆ జలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రమే వినియోగించాలని ఉమ్మడి ఏపీ సర్కారుకు షరతులు పెట్టింది.
దాంతో 70 ఏండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ సంకల్పంతో నాటి ప్రణాళికలన్నీ జీవం పోసుకొన్నాయి. హైదరాబాద్ స్టేట్ మహబూబ్‌నగర్ జిల్లాలో 174 టీఎంసీల జలాలతో 7 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే దశాబ్దాల స్వప్నం.. సాకారమైంది. పాలమూరు పచ్చగా కళకళలాడనుంది.