Olympics: సెమీస్‌లో నిరాశ‌ప‌ర‌చిన భార‌త బాక్స‌ర్.. కాంస్యంతో స‌రిపెట్టుకున్న ల‌వ్లీనా

Olympics: టోక్యో ఒలంపిక్స్‌లో భార‌త ప‌త‌కాల సంఖ్య రెండు చేరిన సంగ‌తి తెలిసిందే. మీరాభాయి ర‌జ‌త ప‌త‌కం గెలుచుకోగా, పీవీ సింధు కాంస్య ప‌తకంతో స‌రిపెట్టుకుంది. ఇక భారత బాక్సర్ లవ్లీనా బోర్గహైన్ గ‌తనెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్‌ చైన్‌పై విజయం సాధించి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఒలంపిక్స్‌కి వెళ్లే ముందు త‌ప్ప‌క ప‌త‌కం తెస్తాన‌ని చెప్పిన లవ్లీనా ఈ రోజు జ‌రిగిన సెమీస్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓట‌మి పాలైంది.

బాక్సింగ్‌ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా సెమీస్‌లో ఓటమి పాలైంది. టర్కీ బాక్సర్‌ బుసేనాజ్‌ చేతిలో పరాజయం చెందింది. దీంతో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. లవ్లీనా బంగారు పతకం సాధించాలని కుటుంబ స‌భ్యుల‌తో పాటు గ్రామంలోని అనేక మంది ప్రార్థించారు .. కొందరు ఆలయాల్లో పూజలు కూడా చేశారు. కాని వారి ఆశ‌లు ఫ‌లించ‌లేదు.

లవ్లీనా కంటే ముందు విజేందర్‌సింగ్‌, మేరీకోమ్‌లు మాత్రమే బాక్సింగ్‌లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టారు. టోక్యో ఒలింపిక్స్ లో భార‌త రెజ్ల‌ర్లు దీపక్ పూనియా , ర‌వి ద‌హియా లు సెమీస్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. 57 కేజీల మెన్స్ ఫ్రీస్ట‌యిల్‌ క్వార్ట‌ర్స్‌లో బ‌ల్గేరియాకు చెందిన జార్జి వంజెలోవ్‌పై 14-4 స్కోర్‌తో ర‌వికుమార్ ద‌హియా విజ‌యం సాధించి సెమీస్‌లోకి ఎంట‌ర్ అయ్యాడు. ఒలింపిక్స్‌ ఆడిన తొలిసారే సెమీ ఫైనల్‌ చేరిన ఆటగాడిగా ప్రత్యేకత చాటుకున్నాడు.

భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్‌ పురుషుల 86 కిలోల విభాగం క్వార్టర్‌ ఫైనల్‌లో ప్రత్యర్థి రెజ్లర్‌, చైనాకు చెందిన జూషన్‌ను 6-3 తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. సెమీస్‌లో అతడు అమెరికాకు చెందిన డేవిడ్‌ మోరిస్‌తో తలపడనున్నాడు.