ప్రేమించిన అమ్మాయి కోసం యూట్యూబ్ క్షుద్ర పూజ‌లు.. చివ‌రికి క‌ట‌క‌టాల పాలు

ఈ రోజుల్లో 15 ఏళ్లు వ‌చ్చాయంటే ప్రేమ, దోమ అంటూ పిచ్చెక్కిపోయిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తల్లిదండ్రుల మాట కూడా విన‌కుండా త‌మ జీవితాల‌ని నాశనం చేసుకుంటున్నారు.అయితే ఈ ప్రేమ పిచ్చిలో కొంద‌రు తాను ప్రేమించిన వ్యక్తి ద‌క్క‌లేద‌ని హ‌త్య‌లు చేస్తున్నారు, యాసిడ్ పోస్తామ‌ని బెదిరిస్తున్నారు. ఇంకొంద‌రు యువ‌కులు అయితే వారే ప్రాణ‌త్యాగం చేసుకుంటున్నారు.ఈ పరిస్థితుల ప‌ట్ల త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల‌కు అవగాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

తాజాగా ఓ ప్ర‌భుద్దుడు త‌న‌కు ద‌క్క‌ని అమ్మాయి వేరే వాడికి ద‌క్కింద‌నే కోపంతో యూట్యూబ్, ఫేస్ బుక్‌లో క్షుద్ర పూజ‌లు చూసి అత్తారింటి ముందు చేశాడు. ఇది చూసి వారంతా వ‌ణికిపోవ‌డం సంచ‌ల‌నం రేపింది. ప్రేమోన్మాది చేష్టలతో ఆమెకు కొత్త తిప్పలు వచ్చిపడ్డడంతో పోలీసుల‌ని ఆశ్ర‌యించింది. దీంతో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన నల్గొండలో కలకలం రేపింది.

occultism for love
occultism for love

రంగారెడ్డి న‌గ‌ర్‌కి చెందిన ముర‌ళికి కొద్ది కాలం క్రితం రాంగ్ కాల్‌లో యువ‌తి ప‌రిచ‌యం అయింది. ఈ ప‌రిచ‌యం మ‌రింత ముదిరింది. రెగ్యుల‌ర్‌గా కాల్స్ చేసుకుంటూ మాట్లాడుతున్న నేప‌థ్యంలో ఒకానొక రోజు ముర‌ళి.. ఆ అమ్మాయికి ప్ర‌పోజ్ చేశాడు. నిన్ను ప్రేమిస్తున్నాననంటూ మురళి చెప్పడంతో ఆమె సున్నితంగా తిరస్కరించింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పేసింది. అయినా ముర‌ళి ఆమెను నీడ‌లా వెంటాడుతూ వ‌చ్చాడు.

ఇటీవ‌ల ఆ అమ్మాయికి పెళ్లైంద‌ని తెలిసి కోపంతో ఊగిపోయాడు. ఆ అమ్మాయి త‌న‌కే దక్కాల‌ని విచిత్ర చేష్ట‌లు చేశాడు. నేరుగా ఆమె భర్తకే ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.అంతటితో ఆగని మురళి మంత్రశక్తితో భయపెట్టి ఆమెను వశం చేసుకోవాలనుకున్నాడు. యువ‌తి మెట్టినింటి ముందు క్షుద్ర‌పూజ‌లు చేశాడు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌‌లలో చూసి క్షుద్రపూజలు చేసిన‌ట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

అయితే ఇంటి ముందు ఎముకలు, నిమ్మకాయలు, కుంకుమ, గుడ్డముక్కలు సహా క్షుద్రపూజలకు వినియోగించే వస్తువులు ఉండ‌డంతో ఇది చూసి అత్తారింటి వారు హ‌డ‌లెత్తిపోయారు. ఈ బాధ‌లు మాకొద్దు అని ఆ యువ‌తిని వ‌దిలించుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు స‌మాచారం. అయితే బాధితురాలు కూడా ఈ బాధ‌లు భ‌రించ‌లేక పోలీసుల‌ని సంప్ర‌దించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మురళిని అరెస్టు చేశారు.