Nikhil: హీరో నిఖిలైనా సామాన్యుడైనా తమ దృష్టిలో ఒకటేన్న హైదరాబాద్ పోలీసులు

Nikhil: ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో కరోనా లాక్డౌన్ ఎంత కఠినంగా అమలవుతోందో చెప్పేందుకు ఇదొక చక్కని ఉదాహరణ. హీరో నిఖిలైనా సామాన్యుడైనా ఎవరైనా తమ దృష్టిలో ఒకటేనని లోకల్ పోలీసులు నిరూపించారు. సరైన అనుమతులు లేకపోతే లాక్డౌన్ సమయంలో రోడ్ల మీద తిరగనిచ్చే ప్రస్తక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ తన సమస్యని ట్విట్టర్ ద్వారా పోలీసుల దృష్టికి తీసుకెళితే తప్ప అది పరిష్కారం కాలేదు. ఈ సంఘటన ఇవాళ ఆదివారం మధ్యాహ్నం రాజధానిలో చోటుచేసుకుంది.

మెడికల్ ఎమర్జెన్సీ అన్నా..

సినీ నటుడు నిఖిల్ కరోనా రోగికి అత్యవసరంగా మందులు అందించేందుకు ఆస్పత్రికి వెళుతుండగా సిటీ పోలీసులు ఆపారు. మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పినా పర్మిషన్ ఇవ్వలేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించినా ససేమిరా అన్నారు. దీంతో అతను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ‘‘కొవిడ్-19తో క్రిటికల్ గా ఉన్న వ్యక్తికి మెడిసిన్స్ ఇవ్వటానికి నేను ఉప్పల్ ప్రాంతం నుంచి మినిస్టర్స్ రోడ్డులోని కిమ్స్ హాస్పిటల్ కి వెళుతుండగా అక్కడి పోలీసులు నా కారును మార్గమధ్యంలో ఆపేశారు. బాధితుడి వివరాలను, వైద్యుడు రాసిన చీటీని చూపెట్టినా పట్టించుకోలేదు. ఎమర్జెన్సీ (ఇ) పాస్ ఉండాల్సిందే అన్నారు’’ అని నిఖిల్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

లొకేషన్ షేర్ చేయండి సార్..

నిఖిల్ ట్వీట్ ని గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. ‘‘డియర్ సార్.. మీరు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ లొకేషన్ ని మాకు పంపండి. అక్కడి అధికారులతో మాట్లాడి మీకు అనుమతి వచ్చేలా చేస్తాం’’ అని రిప్లై ఇచ్చారు. అయితే నిఖిల్ ఇ-పాస్ కోసం ఏకంగా తొమ్మిది సార్లు ప్రయత్నం చేశాడంట. సర్వర్లు డౌన్ కావటంతో అతనికి పాస్ దొరకలేదు. నిఖిల్ ఒక్కడే కాదు. చాలా మంది ఇదే సమస్యను ప్రస్తావిస్తున్నారు. సర్వర్ డౌన్ కావటం వల్ల ఎన్ని సార్లు ప్రయత్నించినా ఇ-పాస్ దొరకట్లేదని పేర్కొంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.