Nandigram: 200 మందిని పైగా గెలిపించారు.. తాను ఓడారు..

Nandigram: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వింత అనుభవం ఎదురైంది. తన పార్టీ తరఫున పోటీ చేసిన 200 మందికి పైగా అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఆమె చివరకు తన మాజీ సహచరుడు సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీపై 1,736 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ఇవాళ ఆదివారం రాత్రి ప్రకటించింది. దీంతో ఈ కౌంటింగ్ పై దేశ వ్యాప్తంగా నెలకొన్న సస్పెన్స్ వీడింది. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని, తన ఓటమిని అంగీకరిస్తున్నానని దీదీ అన్నారు. ‘‘ఇది అసలు పెద్ద విషయమే కాదు. మీరేమీ బాధపడకండి’’ అంటూ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆమె ఓ ప్రకటనలో ఓదార్చారు.

దేశం మొత్తం అటే..

ఇవాళ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నందిగ్రామ్ నియోజకవర్గంపైనే దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. దీనికి కారణం లేకపోలేదు. ఎన్నికల ముందు వరకు టీఎంసీ పార్టీలో ఉన్న మమతా బెనర్జీ రైట్ హ్యాండ్ సువేందు అధికారి చివరి నిమిషంలో కమలం పార్టీలోకి జంప్ చేశారు. దీంతో ఆమె పార్టీ ఈ శాసన సభ ఎన్నికల్లో గెలవటం కష్టమేనని అనుకున్నారు. అతనికి నందిగ్రామ్ సహా 40కి పైగా సెగ్మెంట్లలో పట్టు ఉండటమే దీనికి కారణం అని ప్రచారం జరిగింది. కానీ.. తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. మరో వైపు మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గాన్ని (భవానీపూర్ ని) వదిలిపెట్టి సువేందు అధికారి సెగ్మెంట్ అయిన నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచారు. అతను కాషాయం పార్టీతో చేతులు కలపటం వల్ల తన పార్టీపై ఏమాత్రం ఎఫెక్ట్ పడదని నిరూపించటానికే దీదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

గంటకో తీరు.. తీర్పు..

పశ్చిమ బెంగాల్ తోపాటు దేశ ప్రజల ఆసక్తికి, ఉత్కంఠకు తగినట్లే నందిగ్రామ్ రిజల్ట్ గంటకో తీరుగా మారిపోయింది. తొలి రౌండ్లలో సువేందు అధికారి లీడ్ లో ఉన్నారు. కానీ సాయంత్రానికి మమతా బెనర్జీ ముందుంజ వేశారు. ఒక దశలో 9 వేలకు పైగా ఉన్న ఆధిక్యత 6 ఓట్లకు తగ్గిపోయింది. ఎట్టకేలకు మమతా బెనర్జీ 1,200 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు మూడు గంటలకు ‘‘లేదు.. లేదు..’’ సువేందు అధికారే నెగ్గారు అంటూ ఈసీ ఫైనల్ గా, అఫిషియల్ గా డిక్లేర్ చేసింది.

Advertisement