Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న కన్నుమూత
NQ Staff - February 18, 2023 / 09:57 PM IST

Nandamuri Tarakaratna : మూడు వారాలుగా నందమూరి అభిమానులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నా కూడా తారకరత్న కోలుకోలేదు. ఏ వార్త అయితే వినకూడదు అని అంతా భావించారో అదే వార్త వినాల్సి వచ్చింది. నందమూరి తారకరత్న గుండె పోటుతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మూడు వారాల క్రితం నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని కొద్ది దూరం నడిచిన తర్వాత గుండె పోటుతో కుప్పకూలిన నందమూరి తారకరత్న ని కుప్పంలోని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషయంగా ఉందని మొదట వార్తలు వచ్చాయి, కానీ వైద్యులు తారకరత్న ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతలోనే తారకరత్న ఇక లేరు అంటూ తెలియడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం మరింతగా క్షీణించిందని వైధ్యులు పేర్కొన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు బెంగళూరులోని హృదయాలకు వెళ్లారు. అప్పటి నుండే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన అభిమానులు వ్యక్తం చేశారు. అనుకన్నట్లుగానే ఈ చేదు వార్త వినాల్సి వచ్చింది.
నందమూరి తారక రత్న 1983 జనవరి 8న జన్మించారు. నందమూరి తారక రామారావు మనుమడిగా ఇండస్ట్రీలో తారక రత్న అడుగు పెట్టాడు. తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అందులో కొన్ని సినిమాలు క్యాన్సిల్ అయినా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇండస్ట్రీలో సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేసిన తారక రత్న విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అలరించే ప్రయత్నం చేశాడు.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా తారక రత్న నటించి మెప్పించే ప్రయత్నం చేశాడు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి మొన్నటి వరకు కూడా ఏదో ఒక సినిమా లేదా సిరీస్ లో నటిస్తూనే వచ్చాడు. 2002 సంవత్సరంలో తారకరత్న మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు వచ్చింది. అదే ఏడాది వెంటనే యువరత్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అమరావతి సినిమాలో విలన్ గా నటించి నంది అవార్డును సొంతం చేసుకున్న తారకరత్న ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించాడు. 40 ఏళ్ల వయసులోనే తారకరత్న మృతి చెందడం ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పిస్తుంది. తారకరత్న మరణ వార్త తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఎంతో మంది ప్రముఖులు తారకరత్న ఆరోగ్యం కుదుట పడాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు వారంతా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు.