Nandamuri Tarakaratna : తారకరత్న బతికి ఉంటే కొడాలి నానికి పంచ్ పడేదేమో!
NQ Staff - February 19, 2023 / 07:00 PM IST

Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న మరణ వార్తను అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో భారీ సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయినా కూడా నందమూరి ఫ్యామిలీ హీరో అవ్వడంతో తారకరత్న అంటే ప్రత్యేకమైన అభిమానం ఎంతో మందిలో ఉండేది.
ఇక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి తాత వారసత్వంలో పుణికి పుచ్చుకోవాలని తారకరత్న ఆశపడ్డాడు. అందుకే నాలుగు పదుల వయసు రాగానే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించాడు. అందుకే గత కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.
పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుండి అయినా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఒకటికి రెండు సార్లు తారకరత్న పేర్కొన్నాడు. కానీ వాస్తవానికి తారకరత్న టార్గెట్ కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
గతంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అక్కడ నుండి పోటీ చేసి గెలిచి చరిత్ర సృష్టించాడు. అందుకే వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుండి తారకరత్న పోటీ చేయాలని ఆశపడ్డాడు. నారా లోకేష్ కూడా తారకరత్నను అక్కడి నుంచి పోటీకి దించాలని భావించాడట.
కొడాలి నాని గత కొన్నాళ్లుగా అక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనకు నందమూరి అభిమానుల సానుభూతి మరియు మద్దతు ఉంది. అదే నందమూరి హీరో అక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా తారకరత్నకు మంచి ఫలితం దక్కేది. అందుకే నారా లోకేష్ అక్కడ నుండి తారకరత్నను పోటీ చేయించాలని భావించాడు. ఇంతలోనే ఇలా జరిగింది. ఒక వేళ తారకరత్న బతికుంటే కచ్చితంగా గుడివాడ నుండి పోటీ చేసి కొడాలి నాని చుక్కలు చూపించే వాడేమో.