Nandamuri Tarakaratna : ‘యువగళం’ పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయిన నందమూరి తారకరత్న..!
NQ Staff - January 27, 2023 / 02:15 PM IST

Nandamuri Tarakaratna : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభం అయింది. ముందుగా వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఆపై హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ఆయన ప్రార్థనలు కూడా చేశాడు.
ఇక నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చారు. అయితే పాదయాత్రకు సినీ నటుడు నందమూరి తారకరత్న కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే మసీదులో లోకేష్ తో కలిసి తారకరత్న ప్రార్థనలు కూడా చేశారు.
తాకిడిని తట్టుకోలేక..
కాగా మసీదు నుంచి బయటకు వస్తున్న సమయంలోనే పార్టీ కార్యకర్తలు, శ్రేణుల తాకిడిని తట్టుకోలేక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయన్ను కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు టీడీపీ నేతలు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ తెలిపారు డాక్టర్లు.
ఇక లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన మధ్యాహ్నం 1:05 గంటలకు కుప్పం బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత కొత్త బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు కూడా నివాళి అర్పించి మధ్యాహ్నం 3గంటలకు ‘యువగళం’ బహిరంగ సభకు హాజరై మాట్లాడుతారు.