Bandi Sanjay: బండి సంజయ్ సార్ ఎక్కడున్నారు?.. ‘నాగార్జునసాగర్’ రిజల్ట్ తెలిసిందా?..

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సార్ కి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు చక్కని సందేశం ఇచ్చారు. ‘‘మీకు రాజకీయం గురించి తెలిసింది గోరంత. తెలియాల్సింది కొండంత’’ అని తేల్చి చెప్పారు. దుబ్బాక, బల్దియాల్లో గాలివాటంగా నెగ్గారు తప్ప జనం నిజంగా మీ మీద అభిమానంతోనో నమ్మకంతోనో గెలిపించలేదని మరోసారి కళ్లు తెరిపించారు. ఇటీవలి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి హితబోధ చేసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు కమలనాథులు కట్టిన బైఎలక్షన్ డిపాజిట్ ని ‘సాగర్’లో కలిపేసి రెండోసారి కర్రు కాల్చి వాత పెట్టారు. మూడోసారి అంటే రేపు సోమవారం సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఇవే తరహా ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

తిట్టడం కూడా ఒక కళ..

బండి సంజయ్ కుమార్ సార్ కి తెలిసిన రాజకీయం ఒక్కటే. అది కూడా కేసీఆర్ ని చూసి నేర్చుకున్నదే. అదేంటంటే తిట్టడం. కానీ ఆ తిట్టడం కూడా ఒక కళ అని అతనికి తెలియదు. దాన్ని ఎలా ప్రదర్శించాలో కేసీఆర్ కి తెలిసినంతగా బండి సంజయ్ కే కాదు కదా బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఎవరికీ తెలియదు. కేసీఆర్ ఎవరినైనా తిడితే చక్కగా వినాలనిపిస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం. అదే బండి సంజయ్ తిడితే కోపం వస్తుంది. అసలు అతని మాటే సరిగా అర్థం కాదు. వినబుద్ధే కాదు. అలాంటి వ్యక్తి తెల్లారి లేస్తే కేసీఆర్ కుటుంబాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. దానివల్లే ఎన్నికల్లో ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయని  గమనిస్తున్నాడో లేదో. కాబట్టి ఇప్పటికైనా సమస్యల్ని స్టడీ చేసి, రాష్ట్ర ప్రభుత్వం పైన, టీఆర్ఎస్ పార్టీ పైన నిర్మాణాత్మకంగా విమర్శలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలు బండి సంజయ్ కి సలహా ఇస్తున్నట్లు పొలిటికల్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

తిరుపతిలోనూ ముంచేశాడు..

తిరుపతి ప్రజలు బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ ఇదే బండి సంజయ్ కుమార్ కామెంట్లు చేసి ‘‘భలే భలే మాట్లాడాను’’ అంటూ సంబరపడ్డాడు. కానీ ఇప్పుడేమైంది?. అక్కడా కమలం పార్టీ కమిలిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ని చివరికి కార్పొరేటర్ స్థాయి లీడర్లు కూడా పట్టించుకోవట్లేదని సంగతి మొన్నటి లింగోజిగూడ ఎపిసోడ్ తెర మీదికి తెచ్చింది. కాకపోతే ఆయన్ని ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అస్సలు లెక్కచేయడు. తమ పార్టీ బలాన్నే నమ్ముకొని ముందడుగు వేస్తాడు. జనసేనతో పొత్తుకు ఒప్పుకోడు.

Advertisement