Nagarjuna Sagar : తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి ఇవాళ శనివారం ఒక తమాషా సవాల్ విసిరారు. అన్ని పార్టీల వాళ్లూ నామినేషన్లు వేసి సైలెంటుగా ఇంట్లోనే కూర్చుందామని, ఎవరూ ప్రచారం చేయొద్దని, అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామని ఛాలెంజ్ చేశారు. ఇలా చేస్తే తానే తప్పకుండా విజయం సాధిస్తాననేది ఆయన ధీమా. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో, బీజేపీ నేతలు వాళ్ల భవన్ లో, తాను గాంధీ భవన్ లో కూర్చుందామని సూచించారు. ఈ మేరకు ఆయన హస్తం పార్టీ నాగార్జునసాగర్ పరిధిలోని హాలియా ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

అదే చోట.. ఆవేశంగా..
ఫిబ్రవరి 10వ తేదీన టీఆరెస్ పార్టీ ఎక్కడైతే పబ్లిక్ మీటింగ్ పెట్టిందో సరిగ్గా అదే ప్రాంతం(హాలియా)లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జన గర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించింది. ఈ మీటింగ్ లో నాగార్జునసాగర్ బైఎలక్షన్ క్యాండేట్ జానారెడ్డి ఎప్పుడూలేనంత ఆవేశంగా మాట్లాడటం చెప్పుకోదగ్గ విషయం. ‘‘జానారెడ్డి అంటే పోరాట యోధుడు. శాసన మండలి వ్యవస్థకు ఆద్యుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి నేనేంటో తెలుసు. కానీ బయటికి చెప్పడు. ఈ నియోజకవర్గానికి నేనేమీ చేయలేదని సీఎం గతంలో ఇక్కడే జరిగిన మీటింగులో అన్నాడు. కానీ నేను ఏం డెవలప్మెంట్ చేశానో ఆయన వస్తే చూపిస్తా’’ అని జానారెడ్డి తేల్చిచెప్పారు. డబ్బులకు అమ్ముడుపోయి బానిసలుగా మారొద్దని నాగార్జునసాగర్ ఓటర్లకు సూచించారు.
వాళ్లే నా వారసులు: Nagarjuna Sagar
నాకు రాజకీయ వారసులంటే నా బిడ్డో కాదు.. నా కొడుకో కాదు.. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తా నా వారసుడే అని జానారెడ్డి భావోద్వేగంతో చెప్పారు. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ ని గెలిపించి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పునకు నాగార్జునసాగర్ ఉప ఎన్నికే నాంది పలకాలని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అవినీతి పాలనను అంతమొందించడానికే జానారెడ్డి బరిలో నిలిచారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వీహెచ్, షబ్బీర్ అలీ తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పాల్గొన్నారు.