Biryani : మీకు తెలుసా.. అక్కడ బిర్యానీ తింటే కోరిక కోరికలు తీరుతాయట
NQ Staff - February 3, 2023 / 08:20 PM IST

Biryani : దేవుడి ప్రసాదంగా బిర్యానీ పెట్టడం విడ్డూరం అంటే, ఆ దేవుడి ప్రసాదమైన బిర్యానీ తింటే కోరిన కోరికలు తీరుతాయంటూ స్థానికులు నమ్మడం మరింత విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బిర్యానీ ప్రసాదం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ బిర్యానీ ప్రసాదం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని మధురై లో తిరుమంగళం సమీపంలో ఉనన కుల్లికుడి వడకంపట్టి గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలు మునియాండి స్వామిని తమ దైవంగా పూజిస్తూ ఉంటారు.
ప్రతి సంవత్సరం మునియాండి స్వామికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. చుట్టు పక్కల 50 గ్రామాల వారు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఉత్సవం సందర్భంగా స్వామి వారికి మాంసాహారంతో తయారు చేసిన బిర్యానీ ని నైవేద్యంగా పెడతారు.
ఈ సంవత్సరం కూడా 74 మేకలను 200 కోళ్లను కోసి 2500 కిలోల బియ్యంతో బిర్యానీ తయారు చేశారు. ఆ బిర్యానీ ని స్వామి వారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టారు. ఆ ప్రసాదం తిన్న వారిలో వివాహాలు జరగని వారు ఉంటే వివాహాలు జరగడం, పిల్లలు లేకుంటే సంతానం కలగడం, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు లభించడం, దీర్ఘకాలిక సమస్యలతో ఎదుర్కొంటున్న వారికి ఆ సమస్యల నుండి ఉపశమనం లభించడం జరుగుతుందట.
దాంతో చుట్టు పక్కల గ్రామాల వారు మాత్రమే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఆ ఉత్సవానికి భక్తులు తరలి వస్తున్నారు. ఎవరి నమ్మకం వారిది బిర్యానీ తిని తీరని కోరికలను ఎంత మంది ఈ సంవత్సరం తీర్చుకున్నారో మరి.