Devaryamjal: ఈటలే కాదు.. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి కూడా దొంగలే..

Devaryamjal: హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్ పేట మండలం దేవరయాంజాల్ గ్రామంలో తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్, అతని అనుచరులు 1,500లకు పైగా ఎకరాల దేవాలయ భూమిని కబ్జా చేశారనే ఫిర్యాదులు ఇవాళ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయమూ విధితమే. అయితే అక్కడ ఈటలకు మాత్రమే కాదు.. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలకు కూడా అక్రమంగా భూములు ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ కి సైతం ఆ భూముల్లో వాటాలు ఉన్నాయని, అందువల్ల అందరి బాగోతాలు బయటకు రావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

Devaryamjal

ఇదిగో సాక్ష్యం..

దేవరయాంజాల్ లోని శ్రీసీతారామస్వామి ఆలయ భూముల్లో మంత్రి కేటీఆర్ పేరుతో ఉన్న సేల్ డీడ్ ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాకి విడుదల చేశారు. కేటీఆర్ తో పాటు చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అక్కడ భూములు ఉన్నాయని చెప్పారు. అయితే ఆ భూముల వివరాలను ఆన్ లైన్ లో కనపడకుండా గోల్ మాల్ చేశారని విమర్శించారు. సర్వే నంబర్ 658లోని భూమిని మంత్రి మల్లారెడ్డి అక్రమంగా సొంతం చేసుకున్నారని, ఏడెకరాల్లో ఫామ్ హౌజ్ కూడా కట్టుకున్నారని స్పష్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సీఎండీ దామోదర్ రావుకి సైతం భూమి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Devaryamjal

‘ధరణి’ని అడ్డం పెట్టుకొని..

కేసీఆర్ సర్కారు ‘ధరణి’ పోర్టల్ ని అడ్డంపెట్టుకొని సర్వే నంబర్లను మాయం చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలిసి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అంతకన్నాముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. 1925 నుంచి 2021 వరకు అన్ని సర్వే నంబర్ల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఈ కబ్జాల పర్వంపై విచారణ పూర్తయ్యే వరకు కేటీఆర్, మల్లారెడ్డిలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని వేస్తామని ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు.

Advertisement