Modi-KCR: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్.. ఇంకా ఎందుకు బతుకుతున్నారో?..

Modi-KCR తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ఎందుకు బతికి ఉంటున్నారో తెలియట్లేదు అనే అర్థం వచ్చే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తిట్టే తిట్లకి పీఎం మోడీ ఢిల్లీలోని ఎర్రకోట మీద నుంచి దూకాలని విమర్శించారు. సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ హైకోర్టు తిట్టే తిట్లకి హుస్సేస్ సాగర్ లోకి దూకాలని దెప్పిపొడిచారు. కరోనా వ్యాప్తి నివారణకు ఎక్స్ పర్ట్ లు ఇస్తున్న సూచనలను, సలహాలను వీళ్లిద్దరూ బుట్టదాఖలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఈ రోజు సీఎల్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.

Revanth reddy
Revanth reddy

ఆయన అది.. ఈయన ఇది..

ప్రధాని మోడీయేమో వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను కూల్చటంపై ఫోకస్ పెట్టారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై దృష్టిసారించారని, తద్వారా ఇద్దరూ ప్రభుత్వ పాలనను గాలికొదిలేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చెరిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ఈమధ్యే తెలుగు దేశం పార్టీని వీడి అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. ఈ రెండు అంశాలను పట్టుకొని రేవంత్ రెడ్డి ఈ కామెంట్లు చేశారు.

పాకిస్థాన్ ప్రస్తావన..

రేవంత్ రెడ్డి ఇవాళ్టి తన మీడియా మీట్ లో మన పొరుగు దేశం పాకిస్థాన్ ప్రస్తావన కూడా తేవటం గమనార్హం. ఇండియాలో తయారుచేసే వ్యాక్సిన్లను దాయాది దేశమైన పాకిస్థాన్ లో కూడా ఫ్రీగానే వేస్తున్నారని, అందువల్ల ఇక్కడా ఉచితంగానే అందించాలని సూచించారు. హెటిరో డ్రగ్స్ కంపెనీవాళ్లు మందులను బ్లాక్ లో అమ్ముతున్నారని, అయినా వాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. మంత్రి కేటీఆర్ కి, హెటిరో డ్రగ్స్ సంస్థ యజమానులకు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో భాగస్వామ్యం ఉందని, అందుకే చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని తప్పుపట్టారు.

Advertisement