Movies: సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్‌లో విడుద‌ల కానున్న మూవీస్ ఇవేనా?

Movies: సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్ తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు మళ్లీ రెడీ అవుతున్నారు. ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ ఇండస్ట్రీలో శుక్రవారం సందడి మొదలయ్యేలా కనిపిస్తుంది. కరోనా కేసులు మెల్లగా తగ్గుముఖం పడుతుండటంతో కచ్చితంగా సినిమాలు వరసగా వచ్చేలా కనిపిస్తున్నాయి.

అయితే ముందు ప్రయోగాత్మకంగా కొన్ని సినిమాలను విడుదల చేయనున్నారు నిర్మాతలు. అవి సక్సెస్ అయితేనే మిగిలిన సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే జులై 30న రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ రెండూ కూడా పేరున్న సినిమాలే కావడం విశేషం. ఓ వైపు నారప్ప లాంటి భారీ సినిమాలే ఓటిటి బాట పడుతుంటే.. తేజ సజ్జ, సత్యదేవ్ లాంటి హీరోలు థియేటర్స్ వైపు కదులుతున్నారు.

సత్యదేవ్ నటిస్తున్న తిమ్మరుసు సినిమాను జులై 30న విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఈ సినిమాను కిరాక్ పార్టీ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు తేజ సజ్జ కూడా తన ఇష్క్ సినిమాను జులై 30నే రంగంలోకి దింపుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ తాజాగా కన్ఫర్మ్ చేసారు నిర్మాతలు. ప్రభుత్వాలు అనుమతించిన తర్వాత కూడా ఇప్పటి వరకు థియేటర్స్ అయితే ఓపెన్ చేయలేదు ఎగ్జిబిటర్లు. తాము ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్స్ నెరవేర్చిన తర్వాతే ఓపెన్ చేస్తామని తెలిపారు.

దీనిపై రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా సానుకూలంగానే స్పందించేలా కనిపిస్తున్నాయి. దాంతో ఈ ఒక్క వారం థియేటర్స్ సందడి కనిపించకపోయినా కూడా వచ్చే వారం నుంచి మళ్లీ సందడి మొదలు కావడం ఖాయం అయిపోయింది. జులై చివర్లో చిన్న సినిమాలే విడుదల కానున్నాయి కానీ ఆగస్ట్ మొదటి వారంలో పెద్ద సినిమాలు క్యూ కట్టనున్నాయి.

టక్ జగదీష్, లవ్ స్టోరీ నుంచి మొదలు పెట్టి ఇంకా చాలా సినిమాలు ఆగస్టులోనే రాబోతున్నాయి. కరోనా ఇంకా పూర్తిగా పోలేదు.. ఇలాంటి సమయంలో థియేటర్స్ వైపు ప్రేక్షకులు ఎంతవరకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి చిన్న సినిమాలకు వచ్చే వసూళ్లే మిగిలిన సినిమాల భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయి.