MLC Kavitha : ఈడీ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తోంది.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు..!
NQ Staff - March 16, 2023 / 09:21 AM IST

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అక్కడ కూడా ఆమెకు చుక్కెదురు అయింది. స్టే ఇవ్వలేమంటూ కోర్టు తెలిపింది. అంతే కాకుండా ఈ కేసును ఈ నెల 24న విచారిస్తామంటూ తెలిపింది.
అయితే పిటిషన్ లో ఎమ్మెల్సీ కవిత అనేక విషయాలను పొందు పరిచారు. అధికార పార్టీ ఆదేశాలతో ఈడీ నన్ను వేధిస్తోంది. ఈ కేసులో ఎఫ్ ఐఆర్ లో ఎక్కడా నా పేరు లేదు. కేవలం స్టేట్ మెంట్ల ఆధారంగా నన్ను విచారిస్తోంది. నాకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేమ్ మెంట్లలో విశ్వసనీయత లేదు. ఎందుకంటే ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.
బలవంతంగా లాక్కున్నారు..
చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టడమే ఇందుకు నిదర్శనం. అరుణ్ రామ్ చందర్ పిళ్లైని కూడా బెదరించి నా పేరు చెప్పించారు. ఆయన కూడా తన స్టేట్ మెంట్ ను వెనక్కు తీసుకున్నారు. నా ఫోన్ ను కూడా బలవంతంగా సీజ్ చేశారు. నా ఫోన్ లాక్కున్నప్పుడు నా నుంచి ఎలాంటి వాంగ్మూలం తీసుకోలేదు.
చట్ట విరుద్ధంగా నా ఫోన్ సీజ్ చేశారు. నా ఇంటి దగ్గర లేదా వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ జరపాలి అంటూ పిటిషన్ లో కోరారు ఎమ్మెల్సీ కవిత. ఇక కోర్టులో కూడా ఆమెకు చుక్కెదురు కావడంతో ఆమె కచ్చితంగా ఈడీ విచారణకు హాజరు కావాల్సి వస్తోంది.