MLC Kavitha: బుర్జ్ ఖ‌లీఫాపై బ‌తుక‌మ్మ‌ని చూసి సంతోషించిన క‌విత‌

MLC Kavitha తెలంగాణలో బ‌తుకమ్మ‌కి ఎంత ప్రాముఖ్య‌త ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే ఈ పండగను ప్రతి ఏటా దసరాకు ముందు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. బతుకమ్మ దివ్య రూపం బుర్జ్ ఖలీఫాలపై కాంతిపుంజమై సాక్ష్యాత్కరించింది.

TheNewsQube-

శనివారం నాడు రాత్రి 9.45 గంటలకు తిరిగి 10.30 గంటలకు తెలంగాణ సాంస్కృతిక వైభవ దృశ్యమాలిక బుర్జ్ ఖలీఫాపై కనువిందు చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని టీఆర్‌ఎస్‌ స్థాపనతో ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తయిన ఈ సందర్భంగా బుర్జ్‌ ఖలీఫాపై తెలంగాణ అస్తిత్వాన్ని ప్రదర్శింపజేయడం ద్వారా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అద్భుతమైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ బతుకమ్మను విశ్వవేదికపై ప్రదర్శించడంపై ప్ర‌తి ఒక్క‌రు సంతోషం వ్య‌క్తం చేశారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోతో పాటు కేసీఆర్ చిత్రపటం, ‘జై తెలంగాణ’, ‘జై హింద్‌’నినాదాలను బుర్జ్‌ ఖలీఫా తెరపై తెలుగులో ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్‌ ఖలీఫా తెరపై కనిపించగానే తెలంగాణ వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోను యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు బతుకమ్మ వీడియోను వీక్షించారు. బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం దేశానికే గర్వకారణమని, ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఈ సందర్భంగా బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన UAE ప్రభుత్వానికి, బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియో ప్రదర్శన కార్యక్రమంలో కవితతో పాటు ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యేలు షకీల్‌ అహ్మద్, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్‌ సంజయ్, బిగాల గణేష్‌ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, త‌దిత‌రులు పాల్గొన్నారు.