MLA Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంటే ఏమనుకుంటున్నావ్..

Kondala Rao - March 13, 2021 / 05:40 PM IST

MLA Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంటే ఏమనుకుంటున్నావ్..

MLA Kethireddy ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ ప్రోగ్రామ్ తో పాపులర్ అయిన అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (వైఎస్సార్సీపీ) ఈరోజు శనివారం విశ్వ రూపం ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడి పై గరంగరం అయ్యారు. అతనికి ఇగో ఫీలింగ్ ఎక్కువని, సిగ్గు పడాల్సిన పని ఒకటి చేశాడని మండిపడ్డారు. గంధం చంద్రుడు ఇవాళ ఉంటాడు రేపు పోతాడు అని తేల్చిచెప్పారు. అసలు అతను ఎవడిని నాశనం చేయటానికి వచ్చాడు అని తీవ్ర అసహనం ప్రదర్శించారు. కలెక్టర్ పదవిలో ఉండి హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంపేస్తాడా?..

జిల్లా కలెక్టర్ ఆ జిల్లాకు మేజిస్ట్రేట్ కూడా. అయినంత మాత్రాన అతను జనాన్ని చంపేస్తాడా అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులం ఎందుకు ఉన్నాం? గాడిదలు కాయటానికా? అని ధ్వజమెత్తారు. గంధం చంద్రుడు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎవరినీ లెక్కచేయట్లేదని విమర్శించారు. సీఎం ఆఫీసుకి, మంత్రులకి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని, ఇలా చెప్పుకుంటూపోతే కలెక్టర్ గారి కామన్ సెన్స్ లేని పనులు చాంతాడంత పొడవున ఉంటాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎద్దేవా చేశారు.

జిల్లా స్థాయిలో..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు, గ్రామ, మండల స్థాయి అధికారులను రోజూ పరుగులు పెట్టిస్తుంటారు. సమస్య ఎక్కడ ఉంటే పరిష్కారం కూడా అక్కడే చూపిస్తారు. ప్రభుత్వ పరిపాలనను జనం సమక్షంలోకి తీసుకెళ్లారు. తద్వారా ఎంతో మంది ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ప్రశంసలు పొందుతున్నారు. అలాంటి లీడర్ ఇవాళ ఒక ఇష్యూ గురించి జిల్లా స్థాయి అధికారితో ఢీకొన్నారు.

ఏంటా సమస్య?..

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లవారిపల్లె గ్రామానికి, కడప జిల్లా పులివెందుల మండలం అంకేపల్లి గ్రామానికి మధ్య ఈ వివాదం తలెత్తింది. చిల్లవారిపల్లెలో కాటకోటేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులోభాగంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగించే విషయంలో రెండు పల్లెల మధ్య చిచ్చు రేగింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల్ని కలెక్టర్ గంధం చంద్రుడు పోలీసుల చేత నిలిపివేయించాడు. గుడి తలుపులు కూడా మూసేయించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆలయ పూజారితోపాటు మరో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకి ప్రయత్నించారు. అయితే.. ధర్మవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. బాధితులను పరామర్శించిన అనంతరం శాసన సభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ పై పట్టరాని కోపం ప్రదర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధినైన తనని సంప్రదించకుండా కలెక్టర్ ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవటం ఎమ్మెల్యేకి ఆగ్రహం తెప్పించి ఉంటుందని భావిస్తున్నారు.

వైఎస్ ఫ్యామిలీ మొత్తం..

ఇదే సమస్యని గతంలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి వంటి వాళ్లు సైతం డీల్ చేసినా పరిష్కారం కాకపోతే తాను జోక్యం చేసుకొని ఒక కొలిక్కి తెచ్చానని ఎమ్మెల్యే చెప్పారు. ఎండోమెంట్ విభాగానికి చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు డబ్బులకు కక్కుర్తి పడి ఈ గొడవని పెద్దది చేస్తున్నారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us