Bhatti: ఒట్టి అబద్ధాల.. భట్టీ విక్రమార్క..
Kondala Rao - April 30, 2021 / 07:14 PM IST

Bhatti: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలకు కేసీఆర్ సర్కారే కారణమని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఇవాళ శుక్రవారం విమర్శించారు. ఏడాది కాలంగా కొవిడ్ వెంటాడుతున్నా ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచలేకపోయారని తప్పుపట్టారు. సెక్రటేరియట్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కుప్పకూలిందని తేల్చిచెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబితే వినే దిక్కులేకుండా పోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్నారని భట్టీ విక్రమార్క అబద్ధం చెప్పారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందలేదు. తన ఫాం హౌజ్ లోనే ఐసోలేషన్ లో ఉండి పర్సనల్ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్నారు. ఒక్కసారి మాత్రం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు తప్ప వైద్యం పొందలేదు.
వాస్తవాలు తెలుసుకోండి..
ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలోనే కాదు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలోనూ సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఒట్టి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఖమ్మం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ లీడర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ భట్టి చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని పేర్కొన్నారు. వాస్తవాల్ని తెలుసుకోకుండా భట్టి అవాకులు, చెవాకులు పేలుతున్నారని నిన్న గురువారం చురకలంటించారు. కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తప్ప ఆ ఘటనలతో తమకు సంబంధంలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ తోపాటు తనపై అభాండాలు మోపటం సరికాదని, కలెక్టర్ కి కంప్లైంట్ చేయటం విడ్డూరంగా ఉందని చెప్పారు. కార్పొరేషన్ ఎలక్షన్ లో హస్తం పార్టీకి ఘోర పరాజయం తప్పదనే భట్టి ఇలా నిజాలను కప్పిపుచ్చి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ్ అజయ్ కుమార్ వివరించారు.
బెదిరింపులు.. అక్రమ కేసులు..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోటీలో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ క్యాండేట్లని, వారికి సపోర్ట్ చేసేవాళ్లని బెదిరిస్తూ, అక్రమ కేసులు పెడుతూ, నిర్బంధిస్తున్నారని సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క నిన్న ఖమ్మంలో హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఎలక్షన్ పారదర్శకంగా జరిగేలా చూడాలంటూ కలెక్టర్ కి ఫిర్యాదు కూడా చేశారు. దీన్ని ఖండిస్తూ మంత్రి పువ్వాడ మీడియా ముందుకు వచ్చి అసలు విషయాలు చెప్పారు.