KTR: ఇదేం పద్ధతి మోడీజీ?. ప్రధానికి మంత్రి కేటీఆర్ ప్రశ్న..

KTR ఒన్ ఆర్మీ.. ఒన్ పెన్షన్. ఒన్ నేషన్.. వన్ రేషన్. వన్ కంట్రీ.. వన్ ట్యాక్స్. ఇలా.. వన్ వన్ అంటూ కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం ‘ఒన్ వ్యాక్సిన్.. వన్ ప్రైస్’ దిశగా ఎందుకు ఆలోచన చేయట్లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఒకే దేశంలో ఒకే టీకాకి ఇప్పుడు రెండు రేట్లు చూస్తున్నాం’ అంటూ పట్టిచూపారు. ఈ మేరకు ఆయన ఇవాళ గురువారం ఉదయం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. కరోనా వైరస్ చికిత్స కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు అందించే కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను పుణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) నిన్న బుధవారం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

మీకొకటి.. మాకొకటా?..

‘‘కొవిషీల్డ్ టీకా రేటు కేంద్ర ప్రభుత్వానికైతే రూ.150. రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.400, ప్రైవేట్ హాస్పిటల్స్ కి రూ.600’’ అని ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూనావాలా నిన్న పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇవాళ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ‘‘ఒకే దేశం.. ఒకే పన్ను అని మీరు జీఎస్టీని అమల్లోకి తెస్తే మేం (రాష్ట్రాలు) అంగీకరించాం. అందువల్ల మీరిప్పుడు మీ వన్ వన్ అనే బాటలోనే ఒన్ వ్యాక్సిన్.. వన్ ప్రైస్ విధానాన్ని అమలుచేస్తే బాగుంటుంది. అదనపు ఖర్చును మీరు పీఎం కేర్స్ నిధి నుంచి భరించలేరా? దేశం మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయటానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా?’’ అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీని వివరణ కోరారు. ఇలా అడిగిన మొదటి రాష్ట్ర తెలంగాణే కావటం గమనార్హం.

‘18 ఏళ్లు నిండినవాళ్లకి టీకా’ పైనా..

ఇదిలాఉండగా వచ్చే నెల (మే) ఒకటి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్-19 టీకా వేయించుకునేందుకు అర్హులే అంటూ మోడీ సర్కారు మొన్న ప్రకటించింది. దీంతో ఇప్పటి మాదిరిగానే వీళ్లకి కూడా ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తారేమో అని అందరూ భావించారు. కానీ.. ఆ తర్వాత.. ఇది ఉచితం కాదు.. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలంటూ కేంద్రం తన భారాన్ని దింపేసుకోవటంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement