Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అద్భుత నిర్ణయం.. దేశంలోనే తొలిసారి..

Telangana కరోనా బాధితులను కాపాడుకోవటం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుత నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఆక్సీజన్ సరఫరా కోసం యుద్ధ విమానాలకు పర్మిషన్ ఇచ్చింది. ఎనిమిది ఖాళీ ప్రాణవాయువు ట్యాంకర్లను తీసుకొని ఆ ఫైట్లు ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ కి చేరుకొని, అక్కడ ఆక్సీజన్ ని నింపుకొని తిరిగి హైదరాబాద్ కి వస్తాయి. ఇలా 14.5 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు మన రాష్ట్రానికి చాలా తక్కువ సమయంలో రానుంది. తద్వారా ఎంతో మంది విలువైన ప్రాణాలను నిలబెట్టొచ్చు. ఈ ప్రక్రియను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు.

కేటీఆర్ అభినందనలు..

ఆక్సీజన్ ని సత్వరం హైదరాబాద్ కి తరలించేందుకు మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేష్ కుమార్ చేసిన ప్రయత్నాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. వీళ్లిద్దరూ చేసిన కృషి వల్ల మూడు రోజులు ముందుగానే తెలంగాణ రాష్ట్రానికి ప్రాణవాయువు చేరుకుంటుందని, ఎంతో మంది కొవిడ్-19 బాధితులకు పెద్ద ఊరట కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలా చేయటం ఇండియాలోనే ఇదే తొలిసారని ప్రశంసించారు.

పబ్లిక్.. బీ కేర్ ఫుల్..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని, యాంటీజెన్ టెస్టు చేసినా, ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసినా కొవిడ్-19 పాజిటివ్ అనే వస్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో టెస్టుల రిజల్ట్ వచ్చే వరకు ఆగొద్దని, రోగ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోతున్నాయని హెచ్చరించారు. కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వాసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులూ లేవని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. టెస్ట్ కిట్లు, పడకలు, టీకాలు, మందులు.. ఇలా ఏ కొరతా లేదని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి నిలువు దోపిడీకి గురికావొద్దని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు.

Advertisement