Telangana : కేసీఆర్ కి కిషన్ రెడ్డి లేఖ.. ఈ రోజుల్లో ఉత్తరాలేంటి?..

Telangana: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇవాళ శనివారం ఓ లెటర్ రాశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఉచితంగా ఇస్తున్న ఐదు కేజీల బియ్యాన్ని తెలంగాణలో కూడా అమలుచేయాలని కోరారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమల్లో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. దేశంలోని 80 కోట్ల మంది నిరుపేదలకి లబ్ధి చేకూర్చేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ‘గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ కింద మే, జూన్ నెలలకు ఫ్రీగా బియ్యం ఇస్తోందని చెప్పారు. గతేడాది కూడా అర్హులందరికీ ఐదు కిలోల చొప్పు బియ్యాన్ని ఉచితంగా ఇచ్చినట్లు కిషన్ రెడ్డి తన లేఖలో గుర్తుచేశారు.

ఫోన్ చేయొచ్చు/కలవొచ్చు..

ఈ రోజుల్లో లెటర్లు రాయటాన్ని జనం ఎప్పుడో మర్చిపోయారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. లేఖలు రాసే బదులు ఫోన్ చేసి అడగొచ్చు. లేదా డైరెక్టుగా కలిసి డిమాండ్ చేయొచ్చు. లేదా మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని ఒకేసారి అటు ప్రభుత్వం దృష్టికి, ఇటు ప్రజల దృష్టికి తేవొచ్చు. సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లు పెట్టడం లేటెస్ట్ ట్రెండ్. వీటిలో ఏది చేసినా రికార్డెడ్ గానే ఉంటుంది. అయినా కొంత మంది లీడర్లు లెటర్లు రాయటానికే మొగ్గు చూపుతున్నారు. కరోనా ఉన్నా లేకపోయినా వాళ్ల స్టైల్ అదే. ప్రభుత్వాల మధ్య, ప్రభుత్వ విభాగాల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలనేవి అధికారిక ప్రక్రియలో ఒక భాగంగా ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. బహుశా అందుకేనోమో సీనియర్లు లీడర్లు ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు.

Telangana

జాబులే తప్ప.. జవాబులుండవ్..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే పరిపాలన వ్యవహారాలైతే 99 శాతం జాబులకు జవాబులు వస్తాయి. కానీ ప్రతిపక్ష నాయకులు లేదా ఇతర పార్టీల నేతలు ప్రభుత్వాధినేతలకు రాసే జాబులకు జవాబులు వచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒక వేళ వచ్చినా అవి మీడియాలో పబ్లిష్ కావటం కూడా బహు అరుదు.