Telangana Congress : టీ కాంగ్రెస్ సీనియర్ల మీటింగ్ వాయిదా.. ఆయన ఫోన్ తో వెనక్కి?
NQ Staff - December 20, 2022 / 02:39 PM IST

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేతలు అసమ్మతి వ్యక్తం చేస్తూ పలువురు ముఖ్య నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. మరింత మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నేడు సాయంత్రం జరగబోతున్న కీలక మీటింగ్ లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ మీటింగ్ లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, అసలైన కాంగ్రెస్ మాదే అంటూ సీనియర్లు ప్రకటించే అవకాశం ఉందని అంతా భావించారు. ఈ సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చక్కదిద్దేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు దిగ్విజయ్ సింగ్ కూడా పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడారని తెలుస్తోంది.
అధినాయకత్వంకు చెందిన నాయకుల బుజ్జగింపులతో సీనియర్లు కాస్త వెనక్కు తగ్గి నేడు జరగాల్సిన మీటింగ్ ని క్యాన్సల్ చేసుకున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒక ముఖ్య నేతను పంపించబోతుందని ఆ సమయంలో అన్ని విషయాలు చర్చించాలని కూడా నిర్ణయించారట.
ఇక రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తీసుకొచ్చేందుకు అది నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమయితాయనేది చూడాలి. ఒక వైపు తెలంగాణలో బీజేపీ దూసుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ లో ఇలా అంతర్గత సమస్యలు ఎదుర్కోవడం విచారకం అంటూ ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.