congress : టీ కాంగ్రెస్ లో కీలక మార్పు.. సీనియర్ల ఒత్తిడి పని చేసినట్లేనా?
NQ Staff - January 4, 2023 / 11:11 PM IST
congress : తెలంగాణ కాంగ్రెస్ ను కాపాడుకునేందుకు అధినాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ గా చేసినప్పటి నుండి కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ గా ఎంపిక అవ్వడం లో కీలక పాత్ర పోషించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాకూర్ పై కూడా సీనియర్ లు విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డికి మాణిక్యం ఠాకూర్ అమ్ముడు పోయాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం కూడా తెల్సిందే. తాజాగా పార్టీ యొక్క సీనియర్ లు అంతా కూడా మాణిక్యం ఠాకూర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని.. ఆయన గురించి నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేయడం జరిగింది.
ఆ కారణమో లేదా మరేదైనా కారణమో కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ బాధ్యతల నుండి మాణిక్యం ఠాకూర్ ను తొలగిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆయన్ను గోవా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ గా నియమించడం జరిగింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ గా కొత్తగా మాణిక్ రావు థాక్రే ను ఎంపిక చేసినట్లుగా ఏఐసీసీ అధికారికంగా విడుదల చేసిన నోట్ లో పేర్కొంది. నేడు సాయంత్రం ఏఐసీసీ నుండి అధికారికంగా ఈ ప్రకటన వచ్చింది. వెంటనే ఈ మార్పు అమలులోకి వస్తుందని అధినాయకత్వం విడుదల చేసిన నోట్ లో పేర్కొనడం జరిగింది.