Manchu Vishnu: ఊచ‌లు లెక్క‌పెట్టాల్సిన వాళ్లు ఇప్పుడు బ‌య‌ట తిరుగుతున్నారు.. విష్ణు సంచ‌ల‌న కామెంట్స్

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌( మా ) ఎన్నిక‌ల వేడి మాములుగా లేదు. అధ్య‌క్ష బ‌రిలో ఉన్న ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ‌,జీవిత‌, సీవీఎల్‌ న‌ర‌సింహ‌రావు ఎవ‌రికి వారు త‌మ అస్త్రాల‌ను వ‌దులుతూ అధ్య‌క్ష పీఠం ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో వారు వదిలే కొన్ని బాణాలు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. తాజాగా మంచు విష్ణు ఇండ‌స్ట్రీలో కొంద‌రు పోలీస్ స్టేష‌న్‌లో ఊచ‌లు లెక్క పెట్టారు. నా సాయం వ‌ల‌న ఇప్పుడు బ‌య‌ట తిరుగుతున్నార‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

తాజాగా మంచు విష్ణు ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కి ఈ విషయంపై ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేవలం ‘మా’ బిల్డింగ్ మాత్రమే తన ఎజెండా కాదని.. ఇక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించడం కూడా తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మా బిల్డింగ్‌కి సాయం చేసేందుకు వ‌చ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప్ర‌త్యేక అభినంద‌నలు తెలిపారు.

బాల‌కృష్ణ నా తండ్రి స‌మానుడు, అలాంటి వ్యక్తి చెప్పిన పనిని తప్పకుండా చేస్తానని విష్ణు అన్నారు. ఇక కరోనా వచ్చిన సమయంలో ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు నరేష్ సినీ కార్మికులకు ఎంతో సహాయం చేశారని విష్ణు పేర్కొన్నారు. కష్ట సమయంలో సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని.. కానీ, దాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని విష్ణు పేర్కొన్నారు. మ‌న‌ల్ని న‌మ్ముకున్న వాళ్ల‌కి అండ‌గా ఉండేదే నా ఎజెండా అని విష్ణు స్ప‌ష్టం చేశారు .

ఇక ఇండస్ట్రీలో పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కపెట్టాల్సిన చాలా మంది తాను చేసిన సాయం వల్లే ఇప్పుడు బయట తిరుగుతున్నారని విష్ణు స్పష్టం చేశారు. ఎంతో మందికి సాయం చేసిన విష‌యాన్ని నేను చెప్ప‌ను. కొంద‌రు ఊచ‌లు లెక్క‌పెట్ట‌కుండా ఉన్నారంటే ఎవ‌రి వ‌ల్ల అనేది వారు గుర్తు చేసుకోవాలి. అండర్‌వేర్లతో పోలీస్ స్టేషన్‌లో కూర్చొబెడితే.. తెల్లారి 4.30 గంటలకు వెళ్లి సర్ది చెప్పి బయటకు తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లు కొంచం శృతి మించారంటే.. వాళ్ల పేర్లు బయటపెట్టాల్సి వస్తుంది’ అంటూ మంచు విష్ణు పేర్కొన్నారు.