Madras High Court : గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ.. మద్రాసు హైకోర్టు శనివారం ఒక సంచలన తీర్పు వెలువరించింది. వ్యభిచార గృహాలపై దాడులు చేసే సమయంలో పోలీసులు సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయడం కానీ, వేధించడం కానీ, శిక్షించడం కానీ చేయవద్దని ఆదేశించింది.వ్యభిచార గృహాల్లో దాడులు జరిపినప్పుడు సెక్స్ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

నో అరెస్ట్..
వారిపై కేసులు కూడా నమోదు చేయొద్దని సూచించింది. వ్యభిచార గృహంలో ఉన్న విటుడిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది. వ్యభిచారం కూడా ఒక వృత్తి అని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించింది. వ్యభిచార గృహం నడపడమే చట్టవిరుద్ధమని గుర్తుచేసింది. దాడి సమయంలో వ్యభిచార గృహంలో ఉన్నాడని విటుడిని అరెస్టు చేయడం సరికాదని స్పష్టం చేసింది.
ఇటీవల సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్ల గురించి ఒక సంచలన తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యభిచారం కూడా ఒక వృత్తిగానే గుర్తించాలని, వ్యభిచార గృహాల్లో దాడుల సమయంలో అక్కడ ఉన్న సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. `మేజర్ అయిన ఒక సెక్స్ వర్కర్ తన ఇష్టానుసారం లైంగిక చర్యలో పాల్గొంటే.. ఆ వ్యక్తిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరాదు` అని సుప్రీంకోర్టు పేర్కొంది.
తాజాగా, మద్రాసు హైకోర్టు ఆ తీర్పును ఉటంకిస్తూ.. ఒక బ్రోతల్ హౌజ్ కస్టమర్‌పై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేసింది. వ్యభిచార గృహానికి వచ్చిన కస్టమర్‌ను శిక్షించడం చట్టబద్ధం కాదని, ఆయన సెక్స్‌వర్కర్లను బలవంతం చేయలేదని తేలినందున ఈ కేసు కొట్టివేస్తున్నామని న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ కుమార్ తెలిపారు. అనంతరం చింతాద్రిపేట్‌లోని ఒక వ్యభిచార గృహంలో అరెస్ట్ చేసిన ఉదయ్‌కుమార్ అనే వ్యక్తిని కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.
- Advertisement -
మస్సాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న విషయం తెలుసుకుని పోలీసులు చేసిన దాడిలో ఉదయ్‌కుమార్, పలువురు సెక్స్ వర్కర్లు దొరికిపోయారు. `వ్యభిచార గృహం నిర్వహించడం నేరం. కానీ అందులో వ్యభిచార వృత్తిలో ఉండడం నేరం కాదు. అవి ఐపీసీలోని ఆర్టికల్ 370కిందకు రావు` అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.