Lock Down : మరో పది రోజులు.. మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఓకే..
Kondala Rao - May 30, 2021 / 07:14 PM IST

Lock Down: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మరోసారి పొడిగించారు. ఇంకో పది రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల సేపు సడలింపు ఇస్తుండగా ఇకపై మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనం బయట తిరగొచ్చని, రెండింటి లోపు ఇంటికి చేరాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో పొడిగించిన తేదీ నేటితో పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రివర్గం ఈరోజు భేటీ అయి తాజా పరిస్థితిని సమీక్షించింది.
జూన్ 10 వరకు..
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో లాక్ డౌన్ ని పొడిగించటం ఇది రెండోసారి. మొదటిసారి లాక్ డౌన్ ని ఈ నెల 12 నుంచి విధించారు. తొలుత 10 రోజులన్నారు. ఆ తర్వాత ఈ నెల 22న తొలిసారి పొడిగించారు. అప్పుడు కూడా ఇంకో పది రోజులు లాక్ డౌన్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు రెండోసారి పొడిగించారు. ఈ సారి జూన్ 10 వరకు కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపారు. కాకపోతే ఈసారి సడలింపు సమయాన్ని కూడా పొడిగించటం సంతోషకరం.
ప్రయాణాలు ఊపందుకుంటాయ్..
ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపు సమయం నాలుగు గంటలే కావటం వల్ల దూర ప్రాంతాలకు బస్ సర్వీసులు అందుబాటులో ఉండట్లేదు. దీంతో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పుడు మరో మూడు గంటలు అదనంగా సడలింపు ఇస్తున్నందున జర్నీలను పోస్ట్ పోన్ చేసుకున్నవాళ్లందరూ మళ్లీ మూటా ముల్లే సర్దుకుంటారు. పెళ్లి, ఇతర శుభకార్యాలకు సైతం కాస్త వెసులుబాటు దొరుకుతుంది. వ్యాపారాలు పుంజుకోనున్నాయి. షాపుల దగ్గర క్యూ లైన్లు తగ్గుతాయి. రోడ్ల మీద జనం గుమిగూడే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఆదరా బాదరాగా ఇంటికి చేరాలనే టెన్షన్ తప్పుతుంది. లాక్ డౌన్ పెట్టినా పెట్టకపోయినా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్యలో పెద్దగా మార్పుండకపోవటంతో ఆంక్షలను సడలించటమే బెటర్ అని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.