Lanka Dinakar : పెట్టుబడులపై పసలేని ఆరోపణలు.. అంతా చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే..!
NQ Staff - March 10, 2023 / 11:01 AM IST

Lanka Dinakar : ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా ఆరోపణ చేస్తే కచ్చితంగా జనాలు నమ్మే విధంగా ఉండాలి. అంతే గానీ మసిబూసి మారేడు కాయను చేయాలని చూస్తే ఎలా.. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే పని చేస్తున్నారు. ప్రజలను దారి మళ్లించడంలో దిట్ట అనిపించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మరో పని ముందటేసుకున్నారు.
మొన్న విశాఖ సమ్మిట్ లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వెల్లువను చూసి ఆయనకు నోట మాట రావట్లేదు. దాంతో ఇదంతా ఉట్టిదే అని చెప్పాలని డిసైడ్ అయినట్టు ఉన్నారు. అందుకే తన కోవర్టులను కూడా రంగం లోకి దించుతున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న తన పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
తాను ఒక్కడిని చెబితే ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో ఇప్పుడు బీజేపీలో ఉన్న తన కోవర్టు లంకా దినకర్ తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. టీడీపీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఇంకా కూడా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే చదువుతుంటారు. ఇక తాజాగా ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఇదే పని చేశారు.
విశాఖలో పెట్టుబడుల సదస్సు రూపంలో పెద్ద భూదందాకు తెర తీశారని ఆరోపించాడు. ఇందులో అసలు నిజం ఏమైనా ఉందా.. ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఏడాది ముందు నుంచే ప్రభుత్వంతో ప్రత్యుత్తరాలు సాగిస్తున్నాయంటూ చెబుతున్నారు దినకర్. అవును మరి.. సమ్మిట్ కు వచ్చే కంపెనీలు సడెన్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడం సబబు కాదు.
ప్రభుత్వం అన్ని కంపెనీలతో లెటర్ల రూపంలో చర్చలు జరిపిన తర్వతనే సమ్మిట్ కు ఆయా కంపెనీలు వచ్చాయి. ఇది మాట్లాడకుండా… ఏడాది ముందు నుంచే జగన్ తన సన్నిహితుల కంపెనీలకు దోచి పెట్టేందుకు ప్లాన్ చేశారని చెప్పడంలో ఎంత వరకు నిజం ఉంది. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అసలు నిజాలు మాట్లాడకుండా.. ఏదో మాట్లాడి మసిబూసి మారేడు కాయను చేసే ప్రయత్నాలు చేస్తున్నారు లంకా దినకర్. ఆయన మాటలు బీజేపీ నీడ నుంచి వస్తున్నా సరే.. మాటల్లో పచ్చదనం మాత్రం కనిపిస్తోంది. అంటే ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని ఇట్టే తెలిసిపోతోంది.
గతంలో ఇలాగే చేస్తే.. సోము వీర్రాజు ఆయన్ను సస్పెండ్ చేశారు. తాజాగా మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఇలాంటి మాటలతో అర్థం పర్థం లేని నిందారోపణలు చేయడం తప్ప ఇందులో ఎలాంటి నిజాలు లేవని చెబుతున్నారు విశ్లేషకులు.