Kodali Nani : ప్రస్తుతం ఏపీలో ఒకే విషయం మీద చర్చ సాగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖ మీదే రెండు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఎల్లో మీడియా సాగిస్తున్న నాటకాలపై ఆమె స్పందించి లేఖ రాశారు. కావాలని పనిగట్టుకొని ఎల్లో మీడియా వైఎస్సార్ కుటుంబంపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తుందని.. కావాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వివాదాస్పదం చేస్తుందని… అన్నచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడుతోందని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.

విజయమ్మ రాసిన బహిరంగ లేఖపై మంత్రి కొడాలి నాని తాజాగా స్పందించారు. వివేకానంద హత్యపై ప్రతిపక్షాలు ఏది పడితే అది మాట్లాడుతున్నాయని… అందుకే వైఎస్సార్ భార్యగా… సీఎం జగన్ తల్లిగా విజయమ్మ స్పందించారని నాని అన్నారు.
ఎల్లో మీడియా ప్రవర్తిస్తున్న తీరుపై జగన్ స్పందించకపోయినా… విజయమ్మ ఒక తల్లిగా స్పందించారు. ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా ప్రవర్తిస్తున్నాయి. వివేకానంద హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం. అధికారంలో ఉన్న టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి చెందిన నేతల ప్రమేయం వివేకా హత్య కేసులో ఉందని అప్పుడే ఆరోపణలు వచ్చాయి.. అని నాని అన్నారు.
వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత కూడా మరో మూడు నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు… ఎందుకు హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు అలా వ్యవహరించడం వల్లనే వివేకా కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కూతురు సునిత కోరారు.. అని కొడాలి స్పష్టం చేశారు.
సీఎం జగన్ పై కూడా అప్పట్లో ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. ఆ దాడి కేసును కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. కానీ… సీఎం జగన్ ఏనాడూ తనపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో జోక్యం చేసుకోలేదు… అని నాని స్పష్టం చేశారు.