Kishan Reddy : కిషన్ రెడ్డి సెల్ఫిష్ గేమ్.. వారికి అన్యాయం..!
NQ Staff - November 6, 2023 / 10:54 AM IST

Kishan Reddy :
రాజకీయమంటేనే రూల్స్, గీల్స్ లేని ఓ ఆట.. ఈ ఆటలో ఎన్నో మలుపులు, వ్యూహాలు, కుట్రలు ఉంటాయి. తన ఆట ఆడటమే కాకుండా ఇతరుల ఆటను దెబ్బతీయడానికి కుతంత్రాలు ఉంటాయి. రాజకీయాల్లో ఇలాంటి ఆట సహజమే. అయినా కొందరు మాత్రం మైండ్ గేమ్ ఆడుతూ తాము సేఫ్ జోన్ లో ఉంటారు. అలాంటి పనినే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు. పార్టీ ఏమైపోయిన గానీ తనకు మాత్రం పదవి ఖాయం చేసుకునే వ్యూహం పన్నాడని చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యమరంజుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండగా.. రెండో స్థానంలోనే లేదంటే అధికారంలోకి వస్తుందో అనుకున్న బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది. వందలాది సర్వేల్లో ఏ ఒక్క సర్వే కూడా బీజేపీ మొదటి, రెండో స్థానాల్లో నిలుస్తుందని చెప్పకపోవడం గమనార్హం. సర్వేలు పక్కకు పెడితే ప్రస్తుత పరిస్థితి చూస్తే కామన్ మ్యాన్ కూడా ఈ విషయం చెప్పగలడు. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడైతే తొలగించారో.. అప్పటి నుంచే బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. అసలు బండి సంజయ్ ను ఏ సమీకరణాలతో తొలగించారో బీజేపీ శ్రేణులకు, సగటు జనాలకు ఇప్పటికీ అర్థం కాని విషయమే.
బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అధ్వానంగానే ఉండేది. క్రమేణా బండి సంజయ్ ర్యాలీలు, యాత్రలు, స్పీచ్ లు, కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనే విధంగా స్పీచ్ లతో పార్టీకి కొత్త ఊపు తెచ్చారు. ఇదే జోష్ లో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, హుజురాబాద్ ఎన్నికల్లో విజయాలు ఆ పార్టీకి ఇక తిరుగులేదు.. అనే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ కు అల్టర్ నేట్ బీజేపే ననే అంతా అనుకున్నారు.
అయితే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత కారణాలు ఎవరికీ తెలియవు గానీ అధ్యక్ష పదవిలోకి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డి వచ్చారు. ఇక అప్పటి నుంచి పార్టీ పరిస్థితి దీనంగా మారిపోయింది. అప్పటి వరకు వచ్చిన పెద్ద లీడర్లంతా కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు. ఒకరిద్దరూ తప్ప ఏ ఒక్క వలస నేత కూడా బీజేపీలో ఉండలేకపోయారు. ఇక పాత నేతలు మాత్రమే మిగిలారు. పొత్తుల విషయంలో కూడా కిషన్ రెడ్డి తీరు పార్టీని అవమానపరిచే విధంగా ఉందని క్యాడర్ ఆవేదన పడ్తున్నారు. తెలంగాణలో పవన్ కు అభిమానులే తప్ప క్యాడర్ లేదని తెలిసినా కూడా ఆ పార్టీతో జట్టుకట్టేందుకు వెంపర్లాడడమేంటి అని ప్రశ్నిస్తున్నారు.
జాతీయ పార్టీ అయి ఉండి, మోడీ లాంటి చరిష్మా ఉన్న నేత ఉండగా.. పవన్ కు ఎందుకంతా ప్రాయర్టీ ఇస్తున్నారోనని ఫైర్ అవుతున్నారు. సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జనసేనను ఎప్పుడూ నమ్ముకో లేదని, పార్టీని ఒంటరిగానే సంస్థాగతంగా ఎదిగేందుకు పాటుపడ్డాడని గుర్తుచేసుకుంటున్నారు.
పార్టీలో నుంచి పెద్ద లీడర్లు వెళ్లిపోయినా.. ఇప్పుడున్న పెద్ద నేతల రాజకీయ భవిష్యత్ ను కూడా కిషన్ రెడ్డి పణంగా పెడ్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, అర్వింద్, సోయం బాపురావులను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించి తాను మాత్రం ఎన్నికల్లో బరిలో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వారు గెలిచినా.. ఓడినా కిషన్ రెడ్డికి భవిష్యత్ కు ఢోకా లేకుండా చేసుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ వారు ఎమ్మెల్యేలుగా గెలిస్తే.. ఇక్కడే ఉంటారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయరు..కేంద్రమంత్రి పదవికి తనకు ఎవరూ ఉండరు.. కచ్చితంగా కేంద్ర నాయకత్వం కిషన్ రెడ్డికే ఇవ్వాల్సి వస్తుంది.
ఒకవేళ ఎమ్మెల్యేగా వారు ఓడిపోతే.. వాళ్ల క్రెడిట్ దెబ్బతినే అవకాశం ఉంది. అధినాయకత్వం కూడా కిషన్ రెడ్డిని విడిచిపెట్టి వారికి చాన్స్ ఇచ్చే ప్రయత్నం చేయదు. వారందరి కంటే పెద్ద నేతగా మళ్లీ కిషన్ రెడ్డే ప్రొజెక్ట్ అవుతాడు కాబట్టి మోడీ మూడోసారి గెలిస్తే కిషన్ రెడ్డి పదవికి ఢోకానే ఉండదు. పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి సొంత పదవి కోసం చూసుకుంటున్నాడనే తప్ప పార్టీ భవిష్యత్ ను పట్టించుకోవడం లేదని సగటు బీజేపీ కార్యకర్త ఆవేదన చెందుతున్నాడు.