Kerala Man : మెడ నుండి కాళ్లు ప‌ని చేయ‌వు, కాని కోట్లు సంపాదిస్తున్నాడు…!

Kerala Man : సాధించాల‌నే కృషి ఉంటే సాధించ‌లేనిది ఏమి ఉండ‌దు. ఇది కొంద‌రు ప్రూవ్ చేసి అంద‌రికి ఆద‌ర్శంగా నిలిచారు. తాజ‌గా కేరళలోని కాసరగడ్ జిల్లాకు చెందిన 47 సంవత్సరాల వ్యాపారి. పూర్తిగా మంచానికే పరిమితమైనా సరే.. తన ఎడమ చెవికి ఎయిర్ పాడ్ తగిలించుకుని వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో కోట్లు సంపాదిస్తున్నారు.

దృఢమైన సంకల్పం ఉన్న ఆ వ్యక్తి పేరు టీఏ షానవాస్. ఆయన స్వస్థలం కాసరగోడ్‌ జిల్లాలోని ఈస్ట్ ఎలేరి పరిధిలో ఉన్న కంబలోర్. ప్రస్తుతం కోట్ల రూపాయల విలువైన వ్యాపార కార్యకలాపాలను మంచంపై నుంచే పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్న సమయంలోనే షానవాస్ అనుకోకుండా ఓ ప్రమాదానికి గురయ్యారు.

‘‘2010, మే 6వ తేదీ ఉదయం కలప కొనుగోలు చేయడానికి కరకాలకు వెళ్లాను. రెండు లారీల కలపతో సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యాను. నా మిత్రుడు నడుపుతున్న కారులో నేను ప్రయాణిస్తున్నాను. రెండు ట్రక్కుల కలప లారీలు మా వెనుకే వస్తున్నాయి. అప్పుడు మేము కేరళ సరిహద్దులు దాటాం. కునియ సమీపంలోని పెరియతడుకమ్ చేరుకునే సరికి చీకటి అయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు.

వాహనం రోడ్డు కిందకు వెళ్లిపోతుంటే నేను హెచ్చరించాను. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. కారు రెండు మూడు ఫల్టీలు కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను’’ అని షానవాస్ తెలిపారు. ప్రమాదంలో కారు నుంచి బయటపడ్డ షానవాస్ తల ఓ బండరాయికి కొట్టుకుంది. సహాయం చేయడానికి కూడా అక్కడ ఎవరూ లేకపోవడంతో కలప ట్రక్కులోనే కన్హంగాడ్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు రక్తం విపరీతంగా పోయింది. తలకు బలమైన గాయాలు అయ్యాయి.

స్పైనల్ కార్డ్ దెబ్బతినడంతో ఆపరేషన్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారమని డాక్టర్లు సూచించారు. దీంతో నాలుగు నెలలపాటు ఐసీయూలో మంచానికే పరిమితం అయ్యారు షనవాస్. త తన మెడ భాగంలో స్టీల్ రాడ్ వేయడంతో మెడ కొంచెం కదిలించడానికి వీలవుతోందని చెబుతున్నారు షనవాస్.

సీఎంసీలో వైద్యం తన జీవితాన్ని మలుపు తిప్పిందంటారు షానవాస్. ‘‘ఈ ఆసుపత్రిలో అనేక మంది రోగులను చూశాను. కొందరు అపస్మారక స్థితిలో ఉన్నారు. తీవ్ర గాయాలైన వారిని చూశాను. ఈ విషయంలో నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. మంచి మెదడు, కనీసం నాకు మాట్లాడే అవకాశం అయినా నాకు ఉంది. నా జీవితంలో ఐసీయూలో ఉన్న సమయమే అత్యంత దయనీయమైనది. 9 నెలల తరువాత నా వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని ఆసుపత్రిలోనే నిర్ణయించుకున్నాను’’ అని షనవాస్ తెలిపారు.

అతని నిర్ణయాన్ని భార్య రెహ్మత్ అంగీకరించారు. ఆమె సహకారం లేకుండా ఈ విజయం సాధ్యం అయ్యేది కాదని షానవాస్ చెప్పారు. ‘‘వైద్యానికి భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో వ్యాపారం ప్రారంభించడానికి నా చేతిలో డబ్బు లేదు. నా భార్య తన ఆభరణాలను తనఖాపెట్టి డబ్బు ఇచ్చింది. దీంతో ఒక లారీ కలప కొని వ్యాపారం ప్రారంభించాను. దాన్ని వారంలో అమ్మేశాను. లాభాలు రావడంతో మరలా కలప కొని అమ్మడం ప్రారంభించాను. ఇలా వ్యాపారం గాడిలో పడింది’’ అని షనవాస్ చెప్పారు.

ఇప్పుడు షనవాస్ ఆఫ్రికా, మలేషియా, మాల్దీవుల నుంచి కూడా కలప తెప్పిస్తున్నారు. కేరళలో భవన నిర్మాణాలకు అవసరమైన కలప విక్రయిస్తున్నట్టు షనవాస్ చెప్పుకొచ్చారు.