KCR: సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా వార్త

KCR: కొవిడ్-19 వైరస్ సోకటంతో దాదాపు పది రోజులుగా హోం ఐసోలేషన్ లోనే ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా వార్త వెలువడింది. ఆయనకు లేటెస్టుగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ అని వచ్చింది. ఈ రోజు బుధవారం ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. యాంటీ జెన్ ఎగ్జామ్ లో నెగెటివ్ అని రాగా ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం రేపు గురువారం వెల్లడి కానుంది. తొలిసారిగా ఈ నెల 21న హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి వచ్చి వైద్య, రక్త పరీక్షలు చేయించుకున్న సీఎం కేసీఆర్.. మరోసారి ఆస్పత్రికి వస్తారని అన్నారు. కానీ ఆ అవసరం లేకుండానే తన ఫాం హౌజ్ లోనే మెడికల్ టెస్టులు చేయించుకున్నారు.

హమ్మయ్య.. అనేశారు..

పర్సనల్ డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి ట్రీట్మెంట్ ఇస్తున్న విషయం విధితమే. హాస్పిటల్ లో చేసిన సీటీ స్కాన్ లో కేసీఆర్ ఛాతీలో ఇన్ఫెక్షన్ లేదని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇతర పరీక్షలన్నీ కూడా నార్మల్ గానే రావటం వల్ల జనంలో భరోసా ఏర్పడింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం మళ్లీ ఎప్పుడు తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కి చేరుకుంటారనే ఆసక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.

ఇద్దరూ దూరం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్-1 ముఖ్యమంత్రి కేసీఆర్ కాగా నంబర్-2 మంత్రి కేటీఆర్ అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే తండ్రీ కొడుకు ఇద్దరూ ఒకే సారి కరోనా బారినపడటంతో అధికార పార్టీలో, ప్రభుత్వంలో కాస్త ఆందోళన నెలకొంది. క్వారంటైన్ లో ఉన్నప్పటికీ వీళ్లిద్దరూ ఎప్పటికప్పుడు పాలన పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. యంత్రాంగానికి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు. కాకపోతే పరోక్షంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ లోటు అటు స్పష్టంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని సైతం వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేకుండానే నిన్న మంగళవారం నిర్వహించటం చాలా మందికి నిరుత్సాహానికి గురిచేసింది. అందువల్ల కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ సాధ్యమైనంత త్వరగా మునుపటి మాదిరిగా యాక్షన్ లోకి దిగాలని సర్వత్రా కోరుకుంటున్నారు.

 

 

Advertisement