Telangana: మృత్యుంజయ హోమం.. రామకోటి.. పూజలు.. ఎవరి కోసం?..

Telangana: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు-మంత్రి కేటీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఓ వృద్ధురాలు ఏకంగా రామకోటి రాస్తున్నారు. ఓ వ్యక్తి ఇవాళ ఆదివారం మృత్యుంజయ హోమం కూడా నిర్వహించారు. ఇవన్నీ ఆ తండ్రీ కొడుకుపై తెలంగాణ ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానాలకి అద్దంపడుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేసీఆర్ కుటుంబానికి దగ్గరి బంధువు అయిన రాజ్యసభ ఎంపీ జి.సంతోష్ కుమార్ కి కూడా కొవిడ్-19 సోకడంతో ఆయన సైతం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సీఎం కేసీఆర్ ఆరోగ్యం కోసం మనసులోనే దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.

సికింద్రాబాద్ లో..

రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ ఇవాళ ఆదివారం సికింద్రాబాద్ రోడ్డులోని గణపతి దేవస్థానంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఉదయం ఏడున్నరకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడున్నర గంటల పాటు కొనసాగింది. 11 గంటలకు పూర్ణాహుతితో ముగించారు. ఇందులో భాగంగా గణపతి హోమం, నవగ్రహ ఆరాధన, సుదర్శన, మహా మృత్యుంజయ హోమాలు చేశారు. 11 మంది రుత్వికులు పాల్గొన్నారు.

ఉమ్మడి కరీంనగర్ లో..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న శనివారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ కోతిరాంపూర్ లోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో అధికార పార్టీ లీడర్ కలర్ సత్తన్న పొర్లు దండాలు పెట్టారు. 101 కొబ్బరి కాయలు కొట్టి, భక్తులకు మాస్కులను, శానిటైజర్లను పంపిణీ చేశారు.

నార్కట్ పల్లిలో..

వృద్ధులకు ఆసరా పింఛన్లు అందిస్తూ ఆర్థికంగా అండగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ ఓ వృద్ధురాలు రామకోటి రాయటం ప్రారంభించారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన గూడూరు నాగమ్మ నిన్న శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రం డెవలప్ అవుతోందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుండటంతో వాళ్లంతా సంతోషంగా ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే కేసీఆర్, కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ని వేడుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement