JanaSena : తెలంగాణ రాష్ట్రంలోనూ ‘గాజు గ్లాస్’ లాస్.. దాదాపు 2026 దాకా ఇంతే..

JanaSena : తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలో జనసేన పార్టీ పోటీలో లేకపోవటం, అది ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్డ్ పార్టీయే తప్ప రికగ్నైజ్డ్ పార్టీ కాకపోవటంతో దాని కామన్ ఎలక్షన్ సింబల్ అయిన గాజు గ్లాసును నవతరం పార్టీకి కేటాయించారు. దీంతో బీజేపీ-జనసేన కూటమి కంగుతింది. పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి తమకి పడాల్సిన ఓట్లను కోల్పోవాల్సి వస్తుందంటూ కమలనాథులు ఫీలయ్యారు. అయితే జనసేన పార్టీకి ఇదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎదురైంది. ఈ నెలాఖరులో జరగనున్న 2 మున్సిపల్ కార్పొరేషన్, 5 మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.

ఏంటది?..

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో తమ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును తమకే కేటాయించాలన్న జనసేన రిక్వెస్టును రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తోసిపుచ్చింది. గతేడాది చివరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మొత్తం (150) స్థానాల్లోని కనీసం 10 శాతం సీట్లకు కూడా జనసేన పార్టీ పోటీచేయని నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. బల్దియా ఎలక్షన్స్ లో ఓట్ల చీలికని అరికట్టడం కోసం జనసేన పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎస్ఈసీకి రాతపూర్వకంగా తెలిపారు.

2025 నవంబర్ 18 దాక: JanaSena

పైన పేర్కొన్న అంశాలతోపాటు పవన్ కళ్యాణ్ లేఖని పరిగణనలోకి తీసుకున్నామని, దీనికితోడు జనసేన పార్టీ తాజాగా సమర్పించిన వినతిపత్రంలోని విషయాలు సంతృప్తికరంగా లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. 2025 నవంబర్ 18 వరకు జనసేన, ఇతర పార్టీలు కామన్ సింబల్ కోసం కనీసం అప్లై కూడా చేసుకునే అర్హతను కోల్పోయాయని వివరించింది. జనసేనతోపాటు ఈ ఎదురుదెబ్బ తిన్న పార్టీలు.. ఎంసీపీఐ(యు)-గ్యాస్ సిలిండర్ సింబల్, ఇండియన్ ప్రజా పార్టీ-ఈల గుర్తు, ప్రజా బంధు పార్టీ-ట్రంపెట్ గుర్తు, హిందుస్థాన్ జనతా పార్టీ-కొబ్బరి తోట గుర్తు.

2023లో ఇక ఇంతేనా..

తెలంగాణ రాష్ట్రంలో 2023 ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కనీసం అప్పటికి కూడా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు వచ్చే సూచనలు కనుచూపు మేరలో లేవు. కాబట్టి ఆ పార్టీ డిపాజిట్లు దక్కించుకున్నా గొప్పే అనే అభిప్రాయం నెలకొంది. ఈ నెలలో జరిగే మినీ మున్సిపల్ పోరులో జనసేనకి ఎలక్షన్ కమిషన్ ఏ ఎన్నికల గుర్తు ఇస్తుందో చూడాలి. ఆ పార్టీ ఎన్ని ఓట్లు, సీట్లు సంపాదిస్తుందో అదీ ముఖ్యమే. ప్రస్తుతం కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇది మరో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

Advertisement