MLA Rapaka Vara Prasad : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేయగా, ఒక్క రాజోలులో రాపాక వరప్రసాద్ మినహా పార్టీ అధినేత పవన్ సహా అందరూ ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాపాక అధికార వైసీపీలోకి జంప్ అవుతారనే వార్తలు వచ్చినా.. అప్పట్లో ఆయన అవన్నీ పుకార్లేనంటూ కొట్టిపడేశారు.

బాంబ్ పేల్చాడా..
ఇలా చెప్పిన కొద్ది రోజులకే ఎమ్మెల్యే రాపాక జనసేనకు దూరంగా జరిగి.. అధికార పార్టీ వైసీపీకి దగ్గరయ్యారు. అలాగే అసెంబ్లీలో అధికార వైసీపీ వైపు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలకు జై కొట్టడం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక వైసీపీ ఇన్‌చార్జ్ పదవి కూడా అందించారు. రాజోలుకు ఇప్పటి వరకు ఇద్దరు ఇన్‌చార్జ్‌లను మార్చినా ఫలితం లేదని.. అందుకే అధిష్టానం రాపాక వైపు మొగ్గు చూపిందని సమాచారం.
రాపాక ఎంట్రీతో రాజోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ చిందర వందర అయిపోయింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగి రామరాజుతోపాటు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి సుందరపు బుల్లబ్బాయి రాజీనామా చేశారు. ఈ రోజు వైఎస్ఆర్‌సీపీరాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు రాజీనామా చేశారు.
కేవలం పార్టీ పదవినే కాకుండా.. ఆ పార్టీలోని ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అతనితోపాటు అతని అనుచరులు కూడా పార్టీకి దూరమయ్యారు. వీరి అసంతృప్తి అంతా ఒక్కటే. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఇటీవల ఆయనకు వైసీపీ ఇంచార్జ్ పదవి ఇచ్చారు అనేది ఒక్కటే.
- Advertisement -
తమను పట్టించుకోకుండా రాపాకకు ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆగ్రహంతో రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా వారిని పట్టించుకోవడం లేదు. రాపాక వరప్రసాదే తమకు ముఖ్యం అన్నట్లుగా ఉండటంతో అందరూ రాజీనామా బాట పట్టారు. వేరే పార్టీ నుంచి వచ్చిన రాపాకను నియోజకవర్గ ఇన్చార్జిగా అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు.