Janasena: జనసేనాని కొత్త నినాదం: కాపాడే బాధ్యత నాది.! నమ్మి అవకాశమివ్వండి.!
NQ Staff - June 21, 2022 / 06:22 AM IST

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త నినదాన్ని జనంలోకి తీసుకెళ్ళబోతున్నారు. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ ఆవిర్భవించగా, ఆ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతిచ్చారు పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ చేసిన అతి పెద్ద తప్పు.. అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.

Janasena asks to Give them a Chance to Protect People
సరే, అయ్యిందేదో అయిపోయింది. 2019 ఎన్నికల నాటికి కూడా పార్టీని బలోపేతం చేసుకోలేకపోయిన పవన్ కళ్యాణ్, ఇంకో చారిత్రక తప్పిదాన్ని చేసేశారు.. ఫలితంగా పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కళ్యాణ్ స్వయంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఓడిపోయినా, నిలబడ్డ పవన్ కళ్యాణ్..
పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, జనసేన పార్టీని మూసెయ్యలేదు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. సినిమాలు చేస్తూ, జనసేన పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తున్న జనసేనాని, వీలు చిక్కినప్పుడల్లా జనంలోకి వెళుతున్నారు.
ఈ నేపథ్యంలో జనసేనానికి కొత్త నినాదం అవసరమైంది. ‘ఇప్పటివరకు చాలామందికి అవకాశాలు ఇచ్చారు. ఒక్కసారి జనసేనను నమ్మి అవకాశం ఇవ్వండి. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటాను..’ అని పవన్ కళ్యాణ్ నినదిస్తున్నారు.
కాపాడతారా.? అదెలా.? ప్రత్యేక హోదా ఎలా తీసుకొస్తారు.? రాజధాని విషయంలో ఏం చేస్తారు.? రాష్ట్రం నెత్తిన గుది బండలా మారిన అప్పుల సంగతేం చేస్తారు.? వీటిపై తన వద్దనున్న ప్రణాళిక ఏంటో జనసేనాని చెబితే, ఆయనకు ‘ఒక్క ఛాన్స్ ఇవ్వాలో వద్దో, జనం నిర్ణయించుకుంటారు.