Jagan vs ChandraBabu: పరీక్షలపై జగన్ వర్సెస్ చంద్రబాబు

Jagan vs ChandraBabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించే విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు పెరుగుతున్నాయి. ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ పెట్టే అధికారం ఎవరిచ్చారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరీ అమాయకంగా అడిగారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు పరీక్షల్ని వాయిదా వేయటమో, రద్దు చేయటమో చేస్తే ఏపీలో మాత్రం మొండిగా ముందుకు వెళుతున్నారని విమర్శించారు. విద్యార్థుల ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. కరోనా సమయంలో కూడా స్కూల్స్ తెరిచి ఇప్పటికే 130 మంది విద్యార్థుల మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. స్టూడెంట్స్ పెద్ద చదువులు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా ముందు వాళ్లు ప్రాణాలతో ఉండాలి కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాస్తా ఆలోచించి టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

విద్యార్థులకే నష్టం..

పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు పెట్టకపోతే వాళ్ల భవిష్యత్తుకే నష్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం చేస్తున్న డిమాండ్ ను ఆయన తోసిపుచ్చారు. స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి తనకంటే ఎవరూ ఎక్కువగా ఆలోచించరని తేల్చిచెప్పారు. ఎగ్జామ్స్ పెట్టకుండా సర్టిఫికెట్లలో కేవలం ‘పాస్’ అని రాసిస్తే ముందు ముందు విద్యార్థులకే ఇబ్బందని సీఎం తెలిపారు. మార్కులు లేకపోతే మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా అని ప్రశ్నించారు. పరీక్షలను నిర్వహించాలా వద్దా అనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే వదిలేసిందని, పైగా ఈ విషయంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధానంలేదని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై అపొజిషన్ పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అసలే పరిస్థితులు బాగాలేవనుకుంటున్న తరుణంలో ఇంకా అగ్గిపెట్టాలని చూడటం భావ్యం కాదని వైఎస్ జగన్ హితవు పలికారు.

కేఏ పాల్ ఆగ్రహం..

ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ గానీ మంత్రులు గానీ తమ పిల్లలను పరీక్షలకు పంపుతారా అని కేఏ పాల్ ప్రశ్నించారు. వాళ్ల పిల్లలవే ప్రాణాలు గానీ మిగతావాళ్ల పిల్లలవి కావా అని నిలదీశారు. కరోనా సునామీ కన్నా డేంజరస్ గా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పెట్టడం తెలివి తక్కువ పని అని విమర్శించారు. కరోనా సెంటర్ల తాత్కాలిక ఏర్పాటుకు తన బిల్డింగులను వాడుకోవాలని, వెయ్యి బెడ్లు ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ కి చెప్పినట్లు కేఏ పాల్ వెల్లడించారు.

 

Advertisement