ఏపీలో ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నిక హడావుడి నడుస్తోంది. పేరుకు ఎన్నికలు ఒక తిరుపతి నియోజకవర్గంలోనే అయినా… హడావుడి మాత్రం రాష్ట్రమంతా ఉంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఎలాగైనా తిరుపతిలో గెలవాలన్న కసితో ఉన్న వైసీపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

వైసీపీ ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగాల్సిందేనని… వైసీపీ నేతలు భావిస్తున్న తరుణంలో… తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి సీఎం జగన్ వస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపు కోసం వైఎస్ జగన్ రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 14న తిరుపతిలో వైఎస్ జగన్ ప్రచారం చేయనున్నారు. ఆరోజు సీఎం జగన్ రోడ్ షో ఉంటుందని సమాచారం.
మొత్తం మీద సీఎం జగన్ ప్రచారం చేస్తే… వార్ వన్ సైడ్ అయినట్టే అని వైసీపీ నేతలు తెగ సంబర పడిపోతున్నారు. ఎందుకంటే… ముఖ్యమంత్రి అయ్యాక సీఎం జగన్… ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేదు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జగన్ ప్రచారం చేయలేదు. కానీ… తొలిసారి గురుమూర్తి గెలుపు కోసం తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు సీఎం జగన్. జగన్ ప్రచారానికి వైసీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు.