IPL-14 Match-4 : సంజూ శాంసన్ సెంచరీ వేస్ట్.. పంజాబే కింగ్స్..

IPL-14 Match-4 : ఇవాళ సోమవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లోని 4వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు, పంజాబ్ కింగ్స్ టీమ్ తలపడగా విజయం ఈ రెండు జట్ల మధ్య చివరి బంతి వరకు ఊగిసలాడింది. చివరికి పంజాబ్ కింగ్సే గెలిచింది. రాజస్థాన్ జట్టు సారథి సంజూ శాంసన్ ఒంటి చేత్తే తన జట్టుకు విజయాన్ని అందించాలని ప్రయత్నించినా నెరవేరలేదు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ అతనికి దరిదాపుల్లోకి రాకపోవటం చెప్పుకోదగ్గ విషయం. 222 పరుగుల భారీ స్కోర్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేయగలిగింది. రాయస్థాన్ గెలవటం కష్టమే అని మొదటి నుంచీ అనుకున్నారు. అదే జరిగింది. పది ఓవర్లు పూర్తయినా టీమ్ స్కోర్ వంద దాటకపోవటంతో అభిమానులు ఆశలు వదలుకున్నారు. కానీ సంజూ శాంసన్ పంజాబ్ బౌలింగ్ ని ఊచకోత కోసి విజయ తీరాలకు చేర్చాలని ఒంటరి పోరాటం చేశాడు. తన ఇన్నింగ్సులో ఏకంగా ఏడు సిక్సులు బాదాడు. 12 ఫోర్లు కొట్టాడు. 63 బంతుల్లోనే 119 చేసి లాస్ట్ బాల్ కి ఔటయ్యాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 50 బంతుల్లోనే 91 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ ఎట్టకేలకు తన జట్టుకి విజయాన్ని అందించాడు. కేఎల్ రాహుల్ కి దీపక్ హుడా(64), క్రిస్ గేల్(40) చక్కటి సహకారం అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3, షమీ 2, రిచర్డ్ సన్ 1, మెరెడిత్ 1 వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ipl-14-match-4-punjab-kings-team-wins-over-rajasthan-rayals
ipl-14-match-4-punjab-kings-team-wins-over-rajasthan-rayals

రాజస్థాన్ బౌలింగ్..

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా వచ్చారు. తొలి ఓవర్ లోనే పది రన్నులు చేశారు. కానీ 14 పరుగులు చేసిన మయాంక్ మూడో ఓవర్ లో ఔటయ్యాడు. తర్వాత క్రిస్ గేల్ క్రీజులోకి వచ్చాడు. 7 ఓవర్లకి పంజాబ్ స్కోర్ 50 దాటింది. మరో మూడు ఓవర్లకు మంచి దూకుడు మీదున్న గేల్ 40 రన్నుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కి చేరాడు. అనంతరం దీపక్ హైడా మైదానంలోకి అడుగు పెట్టాడు.

భారీ టార్గెట్: IPL-14 Match-4

11 ఓవర్లకు పంజాబ్ 100 దాటింది. 13వ ఓవర్ లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. దీపక్, రాహుల్ రెచ్చిపోయి ఆడారు. దీంతో 14 ఓవర్లలోనే జట్టు స్కోర్ 150కి చేరింది. 16వ ఓవర్ లో దీపక్ కూడా అర్ధ శతకం పూర్తి చేశాడు. కేవలం 20 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. అయితే 18వ ఓవర్ లో ముందుగా దీపక్ వికెట్ పడింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన పూరన్ కూడా అదే ఓవర్ లో వెనుదిరిగాడు. దీంతో కేఎల్ రాహుల్ కి షారుఖ్ జతకలిశాడు. చివరి (20వ) ఓవర్ లో వ్యక్తిగత స్కోర్ 91 దగ్గర కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇతని ప్లేస్ లో వచ్చిన రిచర్డ్ సన్ సైతం చివరి బాల్ కి పెవిలియన్ కి చేరాడు. దీంతో టోటల్ స్కోర్ 221/6. రాజస్థాన్ రాయల్స్ కి 222 రన్నుల భారీ టార్గెట్ పెట్టారు. రాజస్థాన్ బౌలర్లలో రెహ్మాన్ మూడు వికెట్లు, క్రిస్ మోరిస్ ఒక వికెట్ నేల కూల్చారు.

Advertisement