Interesting survey : భార్యలను భర్తలు కొట్టడాన్ని ఎక్కువగా సమర్థించిన మహిళలు
NQ Staff - November 29, 2021 / 01:04 PM IST

Interesting survey : తాజా సర్వేలో ఆసక్తికర విషయం వెల్లడైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ‘భర్త తన భార్యను కొట్టడం అనే అంశంపై సర్వే నిర్వహించింది. దీంతో ఓ షాకింగ్ సర్వే బయటపడింది. ఇందులో భర్త తన భార్యను కొట్టడాన్ని సమర్ధిస్తారా అనే ప్రశ్నను లేవనెత్తారు.. ఆ ప్రశ్నకు 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 30 శాతం మందికిపైగా మహిళలు ‘అవును’ అని సమాధానమిచ్చారు.

Interesting survey on indian wife and husband
భర్తలు కొట్టడాన్ని మహిళలు సమర్థించిన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణలో 84 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 84 శాతం, కర్నాటకలో 77 శాతం మంది మహిళలు భర్తల చర్యకు మద్దతు తెలిపారు. మణిపూర్‌లో 66 శాతం, కేరళలో 52 శాతం, జమ్ముకశ్మీర్‌లో 49 శాతం, మహారాష్ట్రలో 44 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 42 శాతం మహిళలు.. పురుషులు తమ భార్యలను కొట్టడాన్ని సమర్థించారు.
అయితే హిమాచల్ ప్రదేశ్ మహిళల్లో 14 శాతం మాత్రమే దీనికి మద్దతిచ్చారు. కుటుంబం లేదా పిల్లలను నిర్లక్ష్యం చేయడం, అత్తమామల పట్ల అగౌరవంగా ఉండటం, భర్త-కుటుంబంపై అవిశ్వాసం, వాదించడం, లైంగిక సంబంధం నిరాకరించడం, భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని నిర్లక్ష్యం చేయడం, వంట సరిగా వండకపోవడం వంటివి భార్యలపై భర్తల దాడికి ముఖ్య కారణాలని ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు వెల్లడించారు.
సమాజంలో మహిళలు ఎలా ప్రవర్తించాలో అన్నది నిర్వచించే పద్ధతులని ఆక్స్‌ఫామ్ ఇండియాకు చెందిన జెండర్ జస్టిస్ ప్రధాన స్పెషలిస్ట్ అమితా పిత్రే అన్నారు. మహిళలపై లింగ ఆధారిత హింసను ఆపాలంటే అలాంటి పురుషుల నుంచి మహిళలు దూరం కావడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
మహిళలతో కలిసి పని చేస్తున్నప్పుడు హానికరమైన లింగ సామాజిక నిబంధనలు, మహిళలు-బాలికలపై హింసను సమర్థించే అంశాన్ని ఈ సర్వే ద్వారా అధ్యయనం చేసినట్లు చెప్పారు.