India vs England : చివరి టెస్ట్ : మళ్ళీ వణుకు పుట్టిస్తున్న అక్షర్ పటేల్.. కష్టాలలో ఇంగ్లండ్ జట్టు
Samsthi 2210 - March 4, 2021 / 12:24 PM IST

India vs England :భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పర్యాటక జట్టు. తొలి టెస్ట్ గెలిచి మంచి ఉత్సాహంలో కనిపించిన ఇంగ్లండ్‌కు రెండు, మూడు టెస్ట్‌లలో భారత బౌలర్స్ చుక్కలు చూపించారు. గింగరాలు తిరిగేలా బంతులు విసురుతూ కొద్ది సేపు కూడా క్రీజులో ఉండనివ్వకుండా చేశారు. ఈ రోజు చివరి టెస్ట్ మొతేరా వేదికగా జరుగుతుండగా, ఇందులో గెలిచి సిరీస్‌ను సమం చేసుకోవాలని భావిస్తుంది ఇంగ్లండ్ జట్టు. ఈ రోజు ఉదయం ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జో రూట్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్స్ సిబ్లీ, జాక్ క్రాలే పేసర్స్‌ని సమర్ధంగానే ఎదుర్కొంటున్న నేపథ్యంలో కోహ్లీ.. అక్షర్ పటేట్‌ను రంగంలోకి దింపాడు. అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ సిబ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. సిబ్లీ బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో ఇంగ్లండ్ పరుగులకు తొలి వికెట్ కోల్పొయింది. ఇక రెండో వికెట్ సైతం అక్షర్ పటేల్‌కు దక్కింది. జాక్ క్రాలే భారీ షాట్‌కు యత్నించిన క్రమంలో బంతి గాల్లోకి లేవడంతో సిరాజ్ క్యాచ్ అందుకున్నాడు. ఇక తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి మంచి ఊపు మీద కనిపించిన రూట్ .. ఈ మ్యాచ్‌లో ఎల్బీ డబ్ల్యూగా సిరాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ టీం మరోసారి కష్టాల్లో పడ్డట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం క్రీజులో బెయిర్‌స్టో(10) తో పాటు స్టోక్స్(0) ఉన్నారు.
మూడో టెస్టు మాదిరే నాలుగో టెస్ట్‌లోను పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ను స్పిన్ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరి చేసేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది.స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పదునైన బంతులతో మొతెరా పిచ్‌పై సత్తా చాటితే ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం తప్పదు. ఎలాగైన ఈ మ్యాచ్‌ను చేజిక్కించుకొని లార్డ్స్ వేదికగా జూన్‌లో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)కు అర్హత సాధించాలని భారత్ భావిస్తుంది. ఈ మ్యాచ్ డ్రా అయిన కూడా భారత్‌కు ఫైనల్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల నాలుగో టెస్టు నుంచి భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో సిరాజ్‌కు అవకాశం దక్కింది.