IND Cricket Team: భారత టీంలో కరోనా కలకలం.. రవిశాస్త్రితో పాటు మరో ఇద్దరికి కరోనా
Tech Sai Chandu - September 6, 2021 / 10:00 PM IST

IND Cricket Team: ప్రస్తుతం భారత టీం ఇంగ్లండ్ వేదికగా మ్యాచ్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్ట్ ఆట ఆరంభానికి ముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడినట్టు తేలిన విషయం తెలిసిందే. దీంతో రవిశాస్త్రితో పాటు భారత కోచింగ్ సిబ్బంది మరో ముగ్గురు కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌కి వెళ్లారు.
బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌కి కూడా సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ఈ ముగ్గురూ 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండనుండగా.. శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఐదో టెస్టుకి వీరు దూరంగా ఉండనున్నారు.
ప్రస్తుతం భారత జట్టు, లండన్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏర్పాటుచేసిన బయో సెక్యూలర్ జోన్‌లోనే కుటుంబసభ్యులతో కలిసి బస చేస్తోంది. అలాంటిది రవిశాస్త్రికి వైరస్ ఎలా సోకిందనే కోణంలో ఈసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రవిశాస్త్రి మంగళవారం రాత్రి ఇంగ్లాండ్‌లోని విక్టోరియా ఏరియాలో ఉన్న సెయింట్ జెమ్స్ కోర్ట్ హోటల్‌లో తన పుస్తక ఆవిష్కరణకు హాజరయ్యాడు. ఈ సభకు రవిశాస్త్రితో పాటు భారత సారథి విరాట్ కోహ్లీ మరికొందరు జట్టు సభ్యులు హాజరయ్యారు.
ఈ వేడుకకి చాలా మంది అతిథులు రావడంతో వారిలో ఎవరి ద్వారానైనా రవిశాస్త్రికి వైరస్ సోకి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు అధికారులు. కాగా, వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021తో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కోచ్ పదవి కాలం ముగియనుంది. తన కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత జాతీయ జట్టుతో విడిపోవాలని యోచిస్తున్నట్లు కొంతమంది భారత క్రికెట్ బోర్డు సభ్యులకు రవిశాస్త్రి తెలియజేశాడని సమాచారం తెలుస్తోంది.