Himanta Biswa Sharma : అన్నంత పని చేసిన సీఎం.. ఇప్పటి వరకు 1800 మంది అరెస్ట్
NQ Staff - February 3, 2023 / 02:45 PM IST

Himanta Biswa Sharma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నంత పని చేశారు. బాల్య వివాహాలు చేసుకున్న మగ వారిని అందరిని కూడా అరెస్టు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటనలకే పరిమితం కాకుండా వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు ఇప్పటి వరకు ఏకంగా 1800 మందిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.
బాల్య వివాహాల నిరోధక చట్టం నిబంధనలో ఉల్లంఘించిన వారిపై చట్ట రీత్యా చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. 1800 మందికి పైగా ఇప్పటి వరకు అరెస్టు అయ్యారని, ముందు ముందు మరింత మందిని అరెస్టు చేయబోతున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నారు.
బాల్య వివాహాలను రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్ చేయడంతో పాటు ఒక వేళ బాల్యవివాహాలు చేసుకుంటే కఠిన చర్యలకు సిద్ధమవుతామంటూ ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
14 ఏళ్ల లోపు బాలికలను పెళ్లి చేసుకునే వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 14 నుండి 18 ఏళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే వారిపై బాల్య వివాహాల నిషేధం చట్టం కింద కేసులు నమోదు చేయబోతున్నారు.
మొత్తానికి దేశ వ్యాప్తంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు దక్కించుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ విషయంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే విధంగా దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులు పని చేయాలని మహిళలు కోరుకుంటున్నారు.