HD Kumaraswamy : మోదీ ఆరోపణలు ఉత్తవే..కుమారస్వామి కామెంట్లే నిదర్శనం

NQ Staff - November 13, 2023 / 10:25 PM IST

HD Kumaraswamy : మోదీ ఆరోపణలు ఉత్తవే..కుమారస్వామి కామెంట్లే నిదర్శనం

HD Kumaraswamy :

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ తహతహలాడుతుండగా, ఎలాగైనా బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీసీ సీఎం హామీతో ముక్కోణ బరిలో నిలువాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరి విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ ఆరోపిస్తుండగా.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని ప్రచారం చేస్తోంది.

మొన్నటి నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఫండింగ్ చేశారని ఆరోపించారు. అయితే మోదీ వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని.. అవి కుటుంబ పార్టీలని, తమకు అధికారం అప్పజెప్తే బీసీని సీఎం చేస్తామని బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా జేడీఎస్ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఆయన మాట్లాడుతూ..గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ జిమ్మిక్కులు చేస్తోందని, కర్నాటకలో 5 గ్యారెంటీలు ఎక్కడా అమలు కావడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్నాటకలో ఎక్కడా కూడా 5గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఏ విద్యుత్ సబ్ స్టేషన్ కు వెళ్లినా ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారో ఇట్టే తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తెలంగాణకు వెళ్లి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ 5గంటల కరెంట్ ఏమోగాని కరప్షన్, కమీషన్ల పాలనతో కర్నాటకను దోచుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

కాగా, కుమారస్వామి వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఎన్నికలకు ప్రచారస్త్రంగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్నాటక గతే పడుతుందని, కాంగ్రెస్ ఇచ్చే 3గంటల కరెంట్ కావాలా? కేసీఆర్ ఇచ్చే 24గంటల కరెంట్ కావాలా? అని జనాలను ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా కుమారస్వామి వ్యాఖ్యలతో ప్రధాని మోదీ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేననే ఆరోపణలు ఉత్తివే అని తేలిపోయాయని విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో కేసీఆర్ తో దోస్తీ కట్టిన కుమారస్వామి ఇటీవలే ఎన్డీఏలో చేరారు. అంటే ఆయన బీజేపీ మనిషన్న మాటే. స్వయంగా ఆయనే తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని, బీఆర్ఎస్ కే ఓటు వేయాలని ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నారు. అంటే కేసీఆర్, కాంగ్రెస్ ఒక్కటి కాదనే విషయం అర్థమవుతున్నది.

కుమారస్వామితో ఈ వ్యాఖ్యలను కేసీఆరే చేయించినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంటే కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ఎలాంటి దోస్తీ లేదనే విషయం తెలిసిపోతోంది. అంటే మోడీ చేసిన వ్యాఖ్యలు ఉత్త ఆరోపణలే అని తెలుస్తున్నది. మొత్తానికి కుమారస్వామి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కు మంచి ఎన్నికల అస్త్రం దొరికినట్టైంది. కర్నాటకలో కాంగ్రెస్ పాలనను చూపి తెలంగాణలో ఆ పార్టీని ఇరుకున పెట్టి దెబ్బకొట్టే అవకాశాలు కనపడ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల వ్యాఖ్యలే ప్రచార అస్త్రాలుగా మారి పార్టీల భవిష్యత్ ను నిర్ణయిస్తున్నాయని చెప్పుకోవచ్చు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us