Harish Rao Politically Astute Leader in Telangana : తెలంగాణలో హరీశ్ రావు మళ్లీ నెంబర్ వన్ అవుతాడా..?
NQ Staff - August 31, 2023 / 12:15 PM IST

Harish Rao Politically Astute Leader in Telangana :
హరీశ్ రావు.. ఈ పేరు కొందరికి కొండంత అండ. మరికొందరికి రాజకీయంగా శత్రువు. ఎందుకంటే హరీశ్ రావు వ్యూహం రచిస్తే ప్రత్యర్థి ఎంత బలమైన నేత అయినా సరే ఓడిపోవాల్సిందే. అందుకే ఆయన్ను రాజకీయ చతురత ఉన్న నేత అంటుంటారు. స్వయంగా కేసీఆర్ హరీశ్ రావును బుల్లెట్ లాంటి నాయకుడు అని కితాబు ఇచ్చాడంటేనే ఆయన ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ కు కూడా ఆ బిరుదు కేసీఆర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు.. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా హరీశ్ రావు తన మద్దతు దారులనే గెలిపించుకున్నారు.
రేవంత్ రెడ్డి, డీకే అరుణ లాంటి మహా నేతలను ఓడించిన ఘనత హరీశ్ రావుదే. ఇతర నియోజకవర్గాల్లో ఓడించడమే కాదు.. తన సొంత నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో ఆయన రాష్ట్రంలోనే అత్యధికంగా మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. ఏకంగా లక్ష ఓట్ల మెజార్టీతో దుమ్ములేపారు. ఆయనతో గత ఎన్నికల్లో కేటీఆర్ పోటీ పడ్డారు. ఎలాగైనా హరీశ్ రావు కంటే ఒక్క ఓటు అయినా ఎక్కువగా తెచ్చుకుంటానని చెప్పారు. కానీ హరీశ్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
దాంతో ఈ సారి కూడా ఎన్నికల్లో హరీశ్ రావే పై చేయి సాధిస్తారనే ప్రచారం జరుగుతోంది. 2004 ఉప ఎన్నికల్లో మొదటిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచారు హరీశ్ రావు. అప్పటి నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. ఇప్పుడు ఏడోసారి కూడా గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు లక్షా 19 వేల మెజార్టీ వచ్చింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. అయితే ఈ సారి ఆయన లక్షా యాభై వేల మెజార్టీని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా అంతటి మెజార్టీని సాధించి తనకు తెలంగాణలో తిరుగులేదని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు.
అయితే ఈ సారి ఆయనకు పోటీ ఇచ్చే నాయకులు మాత్రం లేరని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పూజల హరికృష్ణ, బీజేపీ నుంచి దూది శ్రీకాంత్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఈ ఇద్దరికి హరీశ్ ను ఢీకొట్టేంత సత్తా లేదు. వారికి సిద్దిపేటలో అన్ని మండలాల్లో కనీసం వర్గాలు కూడా లేవు. కానీ హరీశ్ రావు అలా కాదు. ఆయనకు ప్రతి ఊరిలో ఓ సెపరేటు వర్గం ఉంది. హరీశ్ రావు అంటే తెలియని వ్యక్తులు లేరు. అంతగా ఆయన ప్రజలతో మమేకం అవుతూ ఉంటారు.
ఇక ఆయన హయాంలో సిద్దిపేట ఓ స్థాయిలో డెవలప్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిపక్షాలు అంటున్నాయి.. రాష్ట్రంలో సిద్దిపేట మాత్రమే డెవలప్ అవుతుందని. దాన్ని బట్టి చెప్పుకోవచ్చు హరీశ్ రావు సిద్దిపేటకు ఏ స్థాయిలో నిధులు తీసుకువస్తున్నారో. మరి ఈ సారి కూడా ఆయన రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలుస్తాననే ధీమాతో ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో.